Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Agri Gold Scam:అగ్రిగోల్డ్ బాధితులకు ఆరు నెలల్లో డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్. రూ. 6000 కోట్ల ఆస్తులు వేలం అందరికీ చెల్లింపులు చేయాలనుకుంటున్నారు.

Agri Gold Assets: ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్ద కాలంగా లక్షలాది కుటుంబాలను కుంగదీస్తున్న అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అగ్రిగోల్డ్ . తమ కష్టార్జితాన్ని దాచుకుని మునిగిపోయిన చిన్న తరహా డిపాజిటర్లకు రాబోయే ఆరు నెలల్లో డబ్బులు చెల్లించడమే లక్ష్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసి, ప్రత్యేక కోర్టుల ద్వారా వేగవంతం చేయడంతో ఈ సుదీర్ఘ పోరాటానికి ఒక ముగింపు లభిస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
ఎంత మంది బాధితులు.. ఎంత బాకీ ఇవ్వాలి?
అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు రియల్ ఎస్టేట్ ప్లాట్లు, అధిక వడ్డీల ఆశచూపి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు 6,380 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించాయి. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 19.5 లక్షల మంది బాధితులు ఉన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.10,000, రూ.20,000 లోపు ఉన్న చిన్న డిపాజిటర్లకు కొన్ని వందల కోట్లు చెల్లించినప్పటికీ, ఇంకా వేలాది మంది మీడియం, పెద్ద డిపాజిటర్లకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి ఉన్నారు.
ప్రభుత్వం వద్ద ఉన్న ఆస్తుల విలువ ఎంత?
అగ్రిగోల్డ్ గ్రూప్ కొనుగోలు చేసిన వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, ప్లాట్లు, నివాస సముదాయాలు, గుంటూరు సమీపంలోని హాయ్‌లాండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ వంటి ఆస్తులను సీఐడీ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేశాయి. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే, ఈడీ, సీఐడీల వద్ద స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 6,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ ఆస్తులను పారదర్శకంగా విక్రయిస్తే డిపాజిటర్ల బకాయిలు దాదాపుగా చెల్లించడానికి సరిపోతాయని అధికార యంత్రాంగం భావిస్తోంది.
గతంలో టీడీపీ వేలం వేయబోతే వైసీపీ అడ్డుకుందా?
గతంలో 2014-19 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అగ్రిగోల్డ్ ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించేందుకు హైకోర్టు పర్యవేక్షణలో ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు, వారికి అనుకూల వర్గాలు కోర్టుల్లో వివిధ రకాల పిటిషన్లు వేయడం, ఆస్తుల విలువను తక్కువ చేసి చూపుతున్నారంటూ వివాదాలు రేపడం వల్ల వేలం ప్రక్రియ వేగం పుంజుకోలేకపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా దఫాల వారీగా కొంతమందే చెల్లింపులు చేయగలిగింది తప్ప, అటాచ్ చేసిన ప్రధాన ఆస్తులన్నింటినీ వేలం వేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోయింది.
ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులు
ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు పంచడం చూడానికి సులువుగా కనిపించినా.. దీని వెనుక సంక్లిష్టమైన లీగల్ చిక్కులు ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీకి ఉన్న హక్కులు, రాష్ట్ర సీఐడీ పరిధిలోని APPDFE చట్టం కింద ఉన్న అటాచ్‌మెంట్ల మధ్య సమన్వయం సాధించి ఆస్తులను రిలీజ్ చేయించడం. అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ బ్యాంకుల వద్ద ఆస్తులను కుదువబెట్టి రుణాలు తీసుకుంది. వాటి కోసం డెట్ రికవరీ ట్రిబ్యునల్ ద్వారా బ్యాంకులు తమకే మొదటి హక్కు ఉందంటూ హైకోర్టును ఆశ్రయించాయి. కంపెనీ ప్రమోటర్లు కుటుంబ సభ్యులు, బెనామీల పేర్లపై పెట్టిన ఆస్తులపై వచ్చిన లీగల్ ఛాలెంజెస్ ను కూడా అధిగమించాల్సి ఉంది.
అంతిమంగా ఆరు నెలల్లో డబ్బులిస్తే బిగ్ రిలీఫ్!
ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక కోర్టుల ఏర్పాటును వేగవంతం చేసి, కేబినెట్ సబ్‌కమిటీ ద్వారా బాధితుల డేటాబేస్‌ను సరి చూస్తోంది. పెద్ద పెద్ద ల్యాండ్ పార్సెళ్లను చిన్న ప్లాట్లుగా విభజించి వేలం వేయడం ద్వారా ఎక్కువ రాబడి రాబట్టవచ్చని ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం గనుక చట్టపరమైన అడ్డంకులను అధిగమించి, రాబోయే ఆరు నెలల గడువులోగా వేలం ప్రక్రియను పూర్తి చేసి డిపాజిటర్ల చేతికి డబ్బులు అందిస్తే.. అది ఒక చారిత్రాత్మక విజయంగా నిలుస్తుంది. దశాబ్ద కాలంగా నమ్మకం కోల్పోయిన లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొండంత అండగా మారడమే కాకుండా.. కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా మైలేజ్ తెచ్చిపెడుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















