అవును, నియోజకవర్గాలకు నిధులు రాకపోవడం, హామీలు నెరవేరకపోవడం, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోంది. మంత్రులు స్పందించడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి.
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
కాంగ్రెస్‌లో నిధులు, ప్రాధాన్యం దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. హామీలు నెరవేరకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

- కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి తీవ్రమవుతోంది.
- పోచారం, దానం వంటివారు హామీలు నెరవేరక ఆందోళన చెందుతున్నారు.
- అభివృద్ధి పనులు జరగక, మంత్రుల స్పందన లేక విమర్శిస్తున్నారు.
- కొందరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్‌లో చేరే యోచనలో ఉన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
- కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తి
- పోచారం, దానం నాగేందర్ పేర్లపై రాజకీయ వర్గాల్లో చర్చ
- హామీలు నెరవేరక.. అభివృద్ధి పనులు ముందుకు సాగక అసహనం
- సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూపులు.. మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదన్న ఆరోపణ
- నియోజకవర్గాల్లో అనుచరులు, ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి
- రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీలో చేరితే నియోజకవర్గాలకు భారీగా నిధులు వస్తాయని, పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన పలువురు ఎమ్మెల్యేలకు అనుకున్న స్థాయిలో ఫలితం కనిపించకపోవడంతో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ క్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరి తర్వాత మరికొందరు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్నా.. దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.
పోచారం వ్యాఖ్యలతో కలకలం
కామారెడ్డి జిల్లా బీర్కూరులో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. తాను మంత్రి పదవి కోసం, డబ్బు కోసం కాంగ్రెస్‌లో చేరలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదన్న అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సమయంలో బాన్సువాడ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని పోచారం గుర్తు చేశారు. కానీ ఆ హామీలు పూర్తిగా అమలు కాలేదన్న భావన ఆయన వ్యాఖ్యల్లో వ్యక్తమైంది.
మంత్రులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా సీఎం మాటలను పట్టించుకోవడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని అంతర్గత పరిస్థితులపై చర్చకు దారితీశాయి. సీఎం స్వయంగా చెప్పినా పనులు జరగడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే వేం నరేందర్‌రెడ్డికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని పోచారం పేర్కొన్నట్లు సమాచారం.
అడకత్తెరలో రెబల్ ఎమ్మెల్యేలు
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయితే పార్టీ మారిన తర్వాత కూడా కాంగ్రెస్‌లో వారికి పూర్తి స్థాయి రాజకీయ స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఉందని వారి అనుచర వర్గాలు చెబుతున్నాయి.
నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానిక నేతలు, అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అధికార పార్టీలోకి వెళ్లిన తర్వాత నిధులు, అభివృద్ధి పనులు వేగంగా వస్తాయని భావించినా.. చాలా చోట్ల పనులు ముందుకు కదలకపోవడం ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన సోదరుడు బీఆర్ఎస్‌లో చేరడం, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పనిచేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పటాన్‌చెరు పరిధిలో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించడంతో గూడెం రాజకీయ వైఖరిపై మరింత ఆసక్తి ఏర్పడింది.
కార్యకర్తల ఒత్తిడిలో మరికొందరు రెబల్స్
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కీలక రోడ్డు పనులు పార్టీ మారి రెండేళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం ఆయనకు ఇబ్బందిగా మారిందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గుర్రం లిఫ్ట్ పథకం పనులు చేపట్టడంతో పాటు పలు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచితే నియోజకవర్గానికి ప్రయోజనం కలుగుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ పనుల్లో జాప్యం జరుగుతుండటం ఆయనను కూడా అసంతృప్తికి గురిచేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పెద్దల్లో అలర్ట్
ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వరుసగా అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరాతీసినట్టు సమాచారం. పోచారం వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులతో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.
అయితే ఎమ్మెల్యేల స్థాయిలో పరిస్థితులు అంత సాఫీగా లేవన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. పార్టీ మారిన సమయంలో ఉన్న రాజకీయ ఉత్సాహం తగ్గిపోవడం, స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయం కుదరకపోవడం, అభివృద్ధి పనులకు నిధులు అందకపోవడం, తమ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు వారిని ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ గులాబీ గూటివైపు చూపులు??
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలలో కొందరు ఇప్పుడు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నారన్న ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. అధికార పార్టీలో చేరిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్న భావన కొందరిలో బలపడుతున్నట్లు సమాచారం.
పోచారం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు దూరంగా కనిపించడం, దానం నాగేందర్ ఇటీవల బీఆరెస్ నాయకత్వాన్ని పొగడటం, సంజయ్ కుమార్, కృష్ణమోహన్‌రెడ్డి నియోజకవర్గ సమస్యలపై ఒత్తిడి ఎదుర్కొంటుండటం.. ఇవన్నీ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్ అడుగులు ఎటు పదతాయా అన్న ఆసక్తిని పెంచుతున్నాయి.
అయితే నిజంగానే వీరిలో కొందరు తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తారా? లేక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకత్వం అసంతృప్తిని చల్లార్చి వారిని పార్టీలోనే కొనసాగేలా చూస్తారా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది.
Frequently Asked Questions
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా?
బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్లాలని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు?
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమిటి?
మంత్రి పదవి కోసం కాదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని పోచారం అన్నారు. ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని, మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదని ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల అసంతృప్తిపై కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందించింది?
కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమై, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పీసీసీ అధ్యక్షుడు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని, అందుబాటులో ఉన్న వనరులతో హామీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















