Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Telangana MLC Election Candidates: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి వంటి నేతలు ప్రయత్నిస్తున్నారు.

Telangana Youth Politics: తెలంగాణ రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినా.. ఇప్పుడు రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. సాధారణంగా ఎన్నికల సమయానికి కొన్ని నెలల ముందు హడావుడి కనిపించడం సహజం, కానీ ఈ సారి ఏకంగా ముందే ప్రధాన రాజకీయ పార్టీల తరఫున యువ నాయకులు, కొత్తతరం ఆశావాహులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్థానాల్లో విద్యావంతులు, యువత ఓటర్లుగా ఉండటంతో సాంప్రదాయ రాజకీయ సీనియర్ల కంటే ఫైర్‌బ్రాండ్ నాయకత్వం, విద్యాధికులైన యువ నేతల వైపే పార్టీలు మరియు ఓటర్లు మొగ్గు చూపే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ నేత సురభి వాణీదేవి ప్రాతిపదికన ఉన్న ఈ సీటు గడువు 2027 మార్చితో ముగుస్తుంది. రాజధాని నగరం, ఐటీ కారిడార్ విస్తరించి ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ గెలుపు పార్టీల ప్రతిష్టకు ప్రతీకగా మారింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిదగా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఆయన ను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
యువ ఆశావాహుల జోరు - సామ, రాకేష్ రెడ్డిల రేసు
ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీల్లో పాత తరం నేతల కంటే యువత, సోషల్ మీడియా ప్రభావం ఉన్న నాయకులే ప్రముఖంగా వినిపిస్తున్నారు. టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్, అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ వైఖరిని గట్టిగా వినిపిస్తున్న సామ రామ్మోహన్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో బలమైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి, గడిచిన కొన్నేళ్లుగా టీవీ డిబేట్లు, క్షేత్రస్థాయి ఉద్యమాల ద్వారా యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ లేదా మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. BITS-Pilani విద్యాధికుడైన రాకేష్ రెడ్డి గత వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి హోరాహోరీ పోరాటం ఇచ్చారు. ఉపఎన్నికలో స్వల్ప తేడాతో ఓడినప్పటికీ లక్షకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించి తన సత్తా చాటారు. రాబోయే ఎమ్మెల్సీ సమరంలో ఆయన మళ్లీ ప్రధాన పోటీదారుడిగా నిలబడేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
అధికార కాంగ్రెస్ Vs బిఆర్ఎస్, బీజేపీ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎన్నికలు ఓ రకంగా పనితీరుకు పరీక్షగా మారనున్నాయి. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, గ్రూప్స్ నియామకాలపై విద్యావంతుల్లో ఉన్న అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే అగ్రెసివ్ కాన్ఫిడెంట్ ఉన్న యువ ముఖాలను బరిలోకి దింపే యోచనలో ఉంది. మరోవైపు, కోల్పోయిన కేడర్ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువ గ్రాడ్యుయేట్లను, విద్యాధికులను ముందు వరుసలో నిలబెడుతున్నారు. ఇక బీజేపీ తన అర్బన్ ఓట్ బ్యాంక్, హిందూత్వ కేడర్‌తో పాటు విద్యావంతుల మద్దతుతో రెండు స్థానాల్లో సత్తా చాటాలని గ్రౌండ్ వర్క్ వేగవంతం చేసింది.
ముందుగా ఓటర్ రిజిస్ట్రేషన్ వార్
త్వరలో ఎన్నికల సంఘం ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభించే అకాశం ఉంది. అప్పటి నుంచే అసలు వార్ ప్రారంభం కనుంది. రాకేష్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి వంటి సోషల్ మీడియా లీడర్లు ఇప్పటికే వందలాది ఐటీ నిపుణులు, నిరుద్యోగులతో డైరెక్ట్ కనెక్ట్ సాధిస్తుండటం ఈ కొత్తతరం రాజకీయాన్ని తెలియజేస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపోటములను నిర్ణయించేది రెండు ప్రధాన అంశాలు. మొదటిది మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రాసెస్ అయితే, రెండోది ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు . ఉద్యోగ ప్రకటనల అమల్లో జాప్యం జరిగితే అది అధికార పార్టీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారే ముప్పు ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా సరైన ప్రత్యామ్నాయ అజెండాను చూపిస్తే తప్ప పట్టభద్రుల ఓట్లను ఆకర్షించలేవు. ఈ సమీకరణాల మధ్య రాబోయే గ్రాడ్యుయేట్ సమరం తెలంగాణ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారబోతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















