Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
భారత టెస్టు బ్యాటర్ సాయి సుదర్శన్ గాయపడటంతో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు అదృష్టం కలిసివచ్చింది. కాలి బొటనవేలి గాయంతో సుదర్శన్ శ్రీలంక టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవడంతో, సర్ఫరాజ్‌కు రెండేళ్ల తర్వాత మళ్లీ టీమ్ ఇండియా నుంచి పిలుపు వచ్చింది. "నేను ఫిట్ కాకపోవచ్చు, కానీ నాకున్న దాంతో పోరాడతా" అని గతంలో పోస్ట్ చేసిన సర్ఫరాజ్, ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ కోసం కఠినంగా శ్రమించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు తన బాడీ సరిపోదనే విమర్శలకు తన ఫిట్‌నెస్‌తోనే సమాధానమిచ్చాడు. గడిచిన ఏడాదిన్నర కాలంలో అతడు ఏకంగా 17 కేజీల బరువు తగ్గి వార్తల్లో నిలిచాడు. ముంబైలో వర్షాల కారణంగా ప్రాక్టీస్ ఆగిపోవడంతో ఏకంగా కశ్మీర్ లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియానికి వెళ్లి మరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. 2024లో న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైనా, ఇటీవల ఇంగ్లాండ్ టూర్‌లో ఇండియా-ఎ తరఫున 92 రన్స్, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీ బాది తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.
సెలెక్షన్ కమిటీ ముందు రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ పేర్లు ఉన్నప్పటికీ, స్పిన్‌ను అద్భుతంగా ఆడే సర్ఫరాజ్ వైపే మొగ్గు చూపారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌ల తర్వాత ఈ స్క్వాడ్‌లో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం సర్ఫరాజ్‌కే ఉంది. ధ్రువ్ జురెల్ ఆఫ్-స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుంటే, సర్ఫరాజ్ దగ్గర స్వీప్, రివర్స్ స్వీప్ లాంటి షాట్లు ఉండటం కలిసొచ్చే అంశం. ఎంసిఏలో ప్రత్యేకంగా రెడ్ సాయిల్ ట్రాక్స్‌పై గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ సిద్ధమయ్యాడు సర్ఫరాజ్.
ట్రెండింగ్ వార్తలు





















