ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతల నిష్క్రమణ వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఇది పార్టీ మనుగడకే అత్యంత క్లిష్టమైన దశగా మారింది.
Raghav Chadha vs Arvind Kejriwal: పంజాబ్ రాజకీయ తుపాను ఆప్‌ను ముంచేస్తుందా? రాఘవ్ చద్దా సహా ఏడుగురి ఎంపీల నిర్ణయంతో ఏం జరగనుంది?
ఆప్ 14 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేనంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ కీలక నేత రాఘవ్ చద్దా సహా ఏడుగురు బీజేపీలో చేరి కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది?

- రాఘవ్ చడ్డా సహా ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో చేరారు.
- పార్టీలో అంతర్గత అసమ్మతి, నాయకత్వ కేంద్రీకరణ కారణాలుగా విశ్లేషణ.
- పంజాబ్ ప్రభుత్వ స్థిరత్వంపై, ఆప్ జాతీయ హోదాపై ప్రభావం.
- ఆప్ తన మూలాలను, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునఃసమీక్షించుకోవాలి.
Raghav Chadha vs Arvind Kejriwal: దేశ రాజకీయాల్లో ఒక డిస్రప్టివ్ స్టార్టప్‌లా దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం తన మనుగడలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టి, కేవలం ఒక దశాబ్ద కాలంలోనే రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుని, జాతీయ పార్టీ హోదాను పొందిన ఆప్, ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతల నిష్క్రమణతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా పార్టీలో అత్యంత ప్రభావవంతమైన యువ నేత, వ్యూహకర్తగా పేరున్న రాఘవ్ చద్దా ఆప్‌కు గుడ్‌బై చెప్పి భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఆప్‌లో ముసలం
రాజ్యసభలో ఆప్‌కు ఉన్న మొత్తం పది మంది ఎంపీలలో ఏడుగురు సభ్యులు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. ఈ బృందానికి రాఘవ్ చద్దా నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో పంజాబ్ నుంచి ఆరుగురు ఢిల్లీ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. వీరంతా కలిసి తమ సంతకాలతో కూడిన పత్రాలను రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. ఈ పరిణామంతో రాజ్యసభలో ఆప్ బలం పడిపోవడమే కాకుండా వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బ తగిలింది.
అనర్హత వేటుకు అవకాశం లేకుండా...
భారత్ రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు ముప్పు లేకుండా మరో పార్టీలో చేరాలంటే కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు అందుకు అంగీకరించాలి. రాజ్యసభలో ఆప్ బలం పది కాగా అందులో ఏడుగురు వెళ్లిపోవడం అనర్హత వేటు నుంచి వారు తప్పించుకున్నారు.
చద్దా సంచలన వ్యాఖ్యలు
రాఘవ్ చద్దా ఒక్కరే కాకుండా పంజాబ్ రాజకీయాలతో సంబంధం ఉన్న మరో అరుగురు ఎంపీలు కూడా ఆయన బాటలోనే నడిచారు. చద్దా బీజేపీలో చేరిన వెంటనే ఆప్ సరైన దారిలో వెళ్లడం మర్చిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ మరోసారి తన కుట్రను అమలు చేసిందని మండిపడ్డారు. చద్దా నిష్క్రమణ తర్వాత ఆయన స్థానంలో రాజ్యసభకు వెళ్లే అభ్యర్థికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ దాడులు ప్రారంభించడం రాజకీయ ఉత్కంఠకు తెరతీసింది.
రెండు కారణాలు చూపిస్తున్న తిరుగుబాటు ఎంపీలు
రాఘవ్ చద్దా వంటి కీలక నేత పార్టీని వీడటానికి గల కారణాలను విశ్లేషిస్తే, ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది పార్టీలో పెరుగుతున్న అంతర్గత అసమ్మతి. చద్దా ఆరోపణల ప్రకారం ఆప్ తన వ్యవస్థాపక విలువలకు దూరమై ఐడియాలాజికల్ డ్రిఫ్ట్‌కు గురైంది. పార్టీలో ప్రజాస్వామ్యం లోపించిందని, నిర్ణయాధికారాలన్నీ కేవలం కేజ్రీవాల్ చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయని అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి. రెండోది నాయకత్వం కేంద్రీకరణ. పార్టీ ప్రారంభం నుంచి కేజ్రీవాల్ నాయకత్వంలో క్రమశిక్షణ ఉన్నప్పటికీ, అది ఇతర నేతలు ఎదగకుండా అడ్డుకట్ట వేసిందనే వాదన ఉంది. ఈ క్రమంలో స్వయంప్రతిపత్తి కోరుకునే నేతలు పార్టీకి దూరమవుతున్నారు.
వ్యూహాత్మక ఎత్తుగడ
గత కొన్ని నెలలుగా పార్టీ నాయకత్వానికి, రాఘవ్ చద్దాకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో చద్దా కీలక పాత్ర పోషించినప్పటికీ, ఇటీవల కాలంలో ఆయనను పక్కన పెట్టారు. చద్దాకు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన Z+ భద్రతను ఉపసంహరించుకోవడం ఈ విభేదాలకు పరాకాష్టగా నిలిచింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు Zకేటగిరి భద్రత కల్పించింది. ఆయన బీజేపీ వైపు వెళ్తున్నారే సంకేతాలను అప్పుడే ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది ఆప్ పార్లమెంటరీ బలాన్ని దెబ్బతీయడమే కాకుండా, పంజాబ్‌లోని 92 మంది ఎమ్మెల్యేల కోటాను కూడా ప్రమాదంలో పడేసింది.
పంజాబ్‌లో ఆప్ కోటకు బీటు
ఢిల్లీ వెలుపల ఆప్ సాధించిన అతి పెద్ద విజయం పంజాబ్. ఈ విజయంలో రాఘవ్ చద్దా ఎంతో కీలకం. ఇప్పుడు ఆయన, పంజాబ్‌కు చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీని వీడటం ఆ రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని ఆప్ నేతలు పంజాబ్ ప్రజలకు చేసిన ద్రోహంగా అభివర్ణిస్తున్నారు. పార్లమెంట్‌లో ఆప్ గొంతుక బలహీనపడటమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి పోచింగ్ ముప్పును ఆప్ ఇప్పుడు తీవ్రంగా ఎదుర్కొంటోంది.
గతానికి కంటే భిన్నంగా...
పార్టీ స్థాపించిన దశాబ్ధంలోనే జాతీయ పార్టీ హోదాను పొంది రికార్డు సృష్టించిన ఆప్ ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం ఆ పార్టీని అభిమానించిన వారిలో ఆందోళన కలిగిస్తోంది. కేజ్రీవాల్ నాయకత్వంలో గవర్నెన్స్ ఫస్ట్ అనే నినాదంతో మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంది. అయితే అధికారం పెరిగే కొద్దీ అంతర్గత తిరుగుబాట్లు కూడా పెరిగాయి. గతంలో కూడా పార్టీ పలు సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ, చద్దా నిష్క్రమణ మాత్రం భిన్నమైంది. ఎందుకంటే ఇది కేవలం ఒక నేత వెళ్లడం మాత్రమే కాదు. ఆప్ క్లీన్ పాలిటిక్స్‌పైనే దాడిగా విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రమాదంలో ప్రభుత్వం
ప్రస్తుతానికి ఆప్ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం నష్టనివారణ చర్యలు. మరిన్ని వలసలు జరగకుండా ఎమ్మెల్యేలను, నేతలను కాపాడుకోవాలి. కేవలం ఒక నిరసన ఉద్యమంగా కాకుండా ఒక స్థిరమైన జాతీయ పార్టీగా ఎదగాలంటే ఆప్ తన నాయకత్వం శైలని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో బలమైన నాయకులను తయారు చేయకపోతే రాబోయే రోజుల్లో ఆప్ తన జాతీయ హోదాను కోల్పోవాల్సి వస్తుంది.
రాఘవ్ చద్దా సహా ఎంపీ నిష్క్రమణ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది. పార్టీ తన మూలాలను, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని. ఈ రాజకీయ గేమ్‌లో ఆప్ తన కోటను ఎలా కాపాడుకుంటోందో చూడాలి.
Frequently Asked Questions
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి?
రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి గల కారణాలు ఏమిటి?
రాఘవ్ చద్దా వంటి కీలక నేత పార్టీని వీడటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి పార్టీలో అంతర్గత అసమ్మతి, వ్యవస్థాపక విలువలకు దూరమవడం. రెండవది నాయకత్వ కేంద్రీకరణ వల్ల ఇతర నేతలు ఎదగలేకపోవడం.
రాఘవ్ చద్దా నిష్క్రమణతో రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంపై ఎలాంటి ప్రభావం పడింది?
రాజ్యసభలో ఆప్ కు ఉన్న మొత్తం పది మంది ఎంపీలలో ఏడుగురు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. ఈ పరిణామంతో రాజ్యసభలో ఆప్ బలం గణనీయంగా పడిపోయింది.
రాఘవ్ చద్దా వంటి ఎంపీలు పార్టీ మారినా అనర్హత వేటు పడకుండా ఎలా తప్పించుకున్నారు?
భారత రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పదవులకు ముప్పు లేకుండా మారాలంటే కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు అంగీకరించాలి. ఆప్ ఎంపీలలో ఏడుగురు వెళ్లడంతో వారు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాఘవ్ చద్దా వంటి ఎంపీలు పార్టీని వీడటం ఆప్ కు ఎలాంటి నష్టం కలిగిస్తుంది?
ఈ పరిణామం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇది పార్టీ పార్లమెంటరీ బలాన్ని దెబ్బతీయడమే కాకుండా, పంజాబ్ లోని ఎమ్మెల్యేల కోటాను కూడా ప్రమాదంలో పడేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















