Supreme Court On Police : అధికార పార్టీకి కొమ్ము కాసే పోలీసులు తర్వాత టార్గెట్ అవుతున్నారు ! సీజేఐ కీలక వ్యాఖ్యలు..!
అధికార పార్టీలతో సన్నిహితంగా ఉంటున్న పోలీసులు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. చత్తీస్‌ఘడ్‌లో ఓ ఏడీజీ స్థాయి అధికారిపై కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో పోలీసు ఉన్నతాధికారులపై రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఓ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే.. ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినప్పుడు వారు తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది రాజకీయాల్లో వచ్చిన కొత్త టెరండ్ అని.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు విచారకరమని ...నిలుపుదల చేయాల్సి ఉందన్నారు.
Police Officials Who Side With Ruling Party Later Get Targeted When Opponent Comes In Power; Sad State Of Affairs : CJI Ramana @Shrutikakk https://t.co/9MEMKYllhI
— Live Law (@LiveLawIndia) August 26, 2021
చత్తీస్‌గడ్‌కు చెందిన అడిషనల్ డైరక్టర్ ఆఫ్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్ తనను ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటోంది.. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణలో సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. చత్తీస్‌ఘడ్‌లో ఏడీజీ హోదాలో ఉన్న గుర్జిందర్ పాల్‌పై చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఇటీవల దేశద్రోహం కేసు నమోదు చేసింది. జార్ఖండ్‌లోని ఆయన ఇంటిపై ఏసీబీ, ఎకనామిక్ అఫెన్సిస్ వింగ్ అధికారులు గత జూన్‌లో సోదాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటి వెనుక చెత్తకుప్పలో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయని.. వాటిని విశ్లేషిస్తే రాజకీయాల లెక్కలు, విమర్శలు అలాగే కొంత మంది ప్రజాప్రతినిధులకు సంబంధించి సమాచారం ఉందని కేసు నమోదు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కుట్ర చేశారని .. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణిస్తూ కేసు పెట్టారు. సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ సమయంలో ఆయన దిగువ కోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ విచారణ జరగక ముందే ఉపసంహరించుకుని హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కేసు చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. రాజకీయ టార్గెట్‌గా మారారన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. నాలుగు వారాల పాటు ఆయనను రక్షణ చేయకుండా రక్షణ కల్పించింది.
ఇటీవల అనేక మంది ఐపీఎస్‌లు ఇలా రాజకీయ కక్ష సాధింపులు ఎదుర్కొంటున్నారు. వారిలో ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్, డీజీ ర్యాంక్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. ఆయన కేసు కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఆయనకు ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ కూడా లేదు. జీతం కూడా ఇవ్వడం లేదు. ఇటీవల ఆయనను డిస్మిస్ చేయాలని కూడా ప్రభుత్వం కేంద్రానికి సిఫార‌్సు చేసింది.