(Source: ECI | ABP NEWS)
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ స్కాంలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు
Supreme Court Takes Suo Motu Note | సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్టుల సమస్యపై తీవ్రంగా స్పందించింది. సైబర్ నేరగాళ్లు నకిలీ ఉత్తర్వులతో డబ్బులు వసూలు చేస్తున్నారు.

Digital Arrest Scams: న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్టుల నేరాలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టు (Supreme Court) ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సైబర్ నేరం, నేరస్తులు అమాయకులకు ఫోన్ చేసి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, లేక మీ పేరుతో నకిలీ బంగారం, డ్రగ్స్ దొరికాయని.. తాము సీబీఐ, ఈడీ అధికారులం అని నమ్మించి అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఫేక్ ఉత్తర్వులను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తారు.
హర్యానాలోని అంబాలాకు చెందిన ఒక కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ జంటను కోర్టు పత్రాలు అని చూపిస్తూ కుట్రపూరితంగా కొందరు మోసం చేశారు. సీనియర్ సిటిజన్లు దీని వల్ల రూ .1.05 కోట్లు మోసపోయారు. అయితే డిజిటల్ అరెస్టు మోసాలపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
'డిజిటల్ అరెస్ట్' పై SC సుమోటోగా స్వీకరణ
జస్టిస్ సూర్యకాంత్, జాయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం డిజిటల్ అరెస్ట్ ముప్పు తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన సంతకాల ఫోర్జరీలతో వ్యక్తులను మోసం చేయడమే కాకుండా న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కూడా డిజిటల్ అరెస్టులు దెబ్బతీస్తాయని ధర్మాసనం పేర్కొంది.
PTI నివేదిక ప్రకారం.. "ఈ కేసు ఒక్కటే కాదు. న్యాయపరంగా డిజిటల్ అరెస్టులను పరిశీలించాలనుకుంటున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు జరిగినట్లు మీడియాలో చాలాసార్లు చూశాం. కనుక న్యాయపరమైన పత్రాలను ఫోర్జరీ చేయడం, అమాయకులను దోచుకోవడం/ దోపిడీ చేయడం, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేసి నేరాలు జరుగుతున్నాయి. అందువల్ల డిజిటల్ అరెస్ట్ నేరాలను పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసుల మధ్య చర్యలు జరగాలి. అందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాము" అని ధర్మాసనం తెలిపింది.
73 ఏళ్ల మహిళ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి (BR Gavai)కి లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సిబిఐ, ఈడి అధికారులమని చెప్పుకుంటూ మోసగాళ్లు ఆడియో మరియు వీడియో కాల్‌ల ద్వారా జంటను బెదిరించారు. సెప్టెంబర్ 3 మరియు 16 మధ్య తేదీలు కలిగిన నకిలీ అరెస్టు మరియు నిఘా ఉత్తర్వులపై నకిలీ కోర్టు స్టాంపులు మరియు సీల్స్ ఉన్నాయి, ఇది బాధితులను బహుళ బ్యాంక్ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేయడానికి ఒప్పించింది.
దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లను, చదువురాని వారితో పాటు డాక్లర్లు, ఇంజినీర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను సైతం లక్ష్యంగా చేసుకుని ఇలాంటి డిజిటల్ అరెస్టు మోసాలు జరుగుతున్నాయని మీడియా కథనాలను కోర్టు ప్రస్తావించింది. ఇటువంటి నేరపూరిత కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కేంద్ర, రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు మధ్య సమన్వయం చేసుకోవాలని సూచించింది.
అటార్నీ జనరల్ అభిప్రాయం సహాయం కోరిన సుప్రీం ధర్మాసనం, హర్యానా ప్రభుత్వం, అంబాలా సైబర్ క్రైమ్ విభాగాన్ని దర్యాప్తుపై స్టేటస్ నివేదికలను సమర్పించాలని తాజాగా ఆదేశించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత నిబంధనల ప్రకారం ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.






















