IRCTC Website Crashes: దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
IRCTC Tickets Booking | దీపావళికి ముందు IRCTC వెబ్‌సైట్ యాప్ క్రాష్ అయింది. లక్షలాది మంది తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోవడంతో తాత్కాలికంగా సేవలు నిలిపివేశారు.
IRCTC Website: దీపావళి సమీపిస్తున్న సమయంలో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, మొబైల్ యాప్ అక్టోబర్ 17న క్రాష్ అయింది. సర్వర్ డౌన్ కావడంతో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీని వలన లక్షలాది మంది ప్రయాణికులు రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోలేకపోయారు. సెలవుల కోసం ఇంటికి వెళ్లడానికి, ట్రావెల్ ప్లాన్ చేసుకున్న వారికి చివరి నిమిషంలో సీట్లు బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ అంతరాయం కలిగింది.
బుకింగ్‌లు, తాత్కాలికంగా సేవలు రద్దు
IRCTC వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన నోటిఫికేషన్ ప్రకారం.. “ ఒక గంట పాటు అన్ని బుకింగ్, రద్దు సేవలు అందుబాటులో ఉండవు.” టిక్కెట్‌లను రద్దు చేయాల్సిన లేదా TDR (టికెట్ డిపాజిట్ రసీదు)ని సమర్పించాల్సిన వినియోగదారులు “08044647999 లేదా 08035734999కి కాల్ చేయాలి లేదా etickets@rcte.co.inకి ఇమెయిల్ చేయండి” అని సూచించారు.
ఈ అంతరాయం దీపావళికి ముందు కీలక సమయంలో జరిగింది. ఇది ప్రయాణీకులలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. వెబ్‌సైట్, IRCTC రైల్ కనెక్ట్ యాప్‌లో లాగిన్ అవ్వలేకపోతున్నామని లేదా చెల్లింపులు చేయలేకపోతున్నామని చాలా మంది సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.
తత్కాల్ విండో టైంకు ముందు నిలిచిన సేవలు
IRCTC తత్కాల్ బుకింగ్ విండో ఏసీ కోచ్ లకు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ టిక్కెట్‌లకు ఉదయం 11 గంటలకు విండో ఓపెన్ అవుతుంది. అయితే శుక్రవారం నాడు ఉదయం 10:40 గంటలకు సిస్టమ్ సర్వర్ నిలిచిపోయింది. తత్కాల్ టికెట్స్ బుకింగ్‌లు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు విండో క్లోజ్ అయింది. వేల మంది వినియోగదారులు టిక్కెట్‌లు బుక్ చేసుకునేందుకు వీలు కాలేదు. అందుకు బదులుగా ఎర్రర్ మెసేజ్‌లు కనిపించాయి.
దీపావళికి ముందు టిక్కెట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బస్సులు, ఫ్లైట్ లలో కంటే రైలు జర్నీ బెటర్ అని భావిస్తుంటారు. కానీ సర్వర్ డౌన్ అయి క్రాష్ కావడంతో తలపట్టుకుంటున్నారు. విపరీతమైన రద్దీ ఉన్న సమయంలోనే టికెట్లు బుకింగ్స్ చేసుకోవడానికి వీలు అవకపోవడంతో ఇబ్బంది పడ్డారు.
IRCTC స్టాక్ సైతం తగ్గింది
టికెట్లు బుకింగ్ సైట్, యాప్ క్రాష్ కావడంతో IRCTC షేర్లు సైతం ప్రభావితం అయ్యాయి. శుక్రవారం 11:10 గంటలకు, కంపెనీ స్టాక్ BSEలో 0.28 శాతం తగ్గి రూ. 717.05 వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లో IRCTC షేర్లు 0.34 శాతం లాభాన్ని ఇవ్వగా.. గత రెండు వారాల్లో 1.44 శాతం పెరిగాయి.
గత ఆరు నెలల్లో ఐఆర్‌సీటీసీ స్టాక్ 6.74 శాతం మేర తగ్గింది. గత సంవత్సరంలో ఈ స్టాక్ 17.69 శాతం తగ్గింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ప్రస్తుతం దాదాపు రూ. 57,400 కోట్లుగా ఉంది. IRCTC టీమ్ సేవలు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తుందని, యూజర్లకు కలిగిన అసౌకర్యంపై ప్రకటన విడుదల చేసింది.






















