Afghanistan crisis: 129 మందితో కాబూల్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం.. ఢిల్లీకి ఎప్పుడు చేరుకుంటుందంటే..
అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. అక్కడే ఉండిపోయిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటి కిందట ఢిల్లీకి బయలుదేరింది.
అఫ్గానిస్తాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి 129 మంది ప్యాసింజర్లను స్వదేశానికి సేఫ్ గా భారత ప్రభుత్వం తీసుకొస్తుంది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి ఎయిరిండియా విమానం ఏఐ-244 కొద్దిసేపటి క్రితం 129 మంది ప్రయణికులతో ఢిల్లీకి బయలుదేరింది. ఈ సాయంత్రం 6.06 గంటలకు విమానం కాబూల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అయ్యిందని ఎయిరిండియా అధికారులు చెప్పారు. ఇవాళ రాత్రికి విమానం ఢిల్లీకి చేరుకోనుంది.
ప్రస్తుతం అఫ్గాన్ లో పరిస్థితులను చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పరిస్థితులను బట్టి అఫ్గాన్ లోని భారత దౌత్యాధికారులను వెనక్కు రప్పించాలా..? లేక అక్కడే ఉంచాలా ? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
అఫ్గానిస్థాన్ లో కొన్ని వారాలుగా తాలిబన్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య వార్ కొనసాగింది. అప్పటికే అఫ్గాన్ నుంచి విదేశీ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు మెల్లమెల్లగా పట్టు సాధించారు. ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తూ వచ్చి.. ఇవాళ రాజధాని కాబూల్‌ను కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ దేశం మెుత్తం.. తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.
విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది కాబుల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. కీలక పత్రాలను నాశనం చేసి.. ఆదివారం అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో.. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ఎగురుతూ కనిపించాయి. కార్యాలయానికి చెందిన వాహనాలు ఆ ప్రాంతాన్ని వీడుతున్న దృశ్యాలు కనిపించాయి. దేశం మొత్తం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. దేశ రాజధాని కాబూల్‌లోకి కూడా ప్రవేశించారు తాలిబన్లు. ఇప్పటి వరకు 19 ప్రావిన్సులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు అఫ్గాన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తోంది అమెరికా. అష్రఫ్ ఘనీ అమెరికాకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వేలాదిమంది అఫ్గాన్ పౌరులు దేశం విడిచిపారిపోతున్నారు. తాలిబన్ల పాలన చీకటి రోజులు వాళ్లను వెంటాడుతున్నాయి.
అఫ్గాన్‌లోని ముఖ్యమైన నగరం జలాలాబాద్‌ను ఆదివారం తెల్లవారు జామున ఆక్రమించారు తాలిబన్లు. దీంతో తూర్పు ప్రాంతానికి, దేశ రాజధాని కాబుల్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. జలాలాబాద్ నగరంలోని గవర్నర్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు తాలిబన్లు. వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే.. భద్రతా దళాలు లొంగిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.