Afghanistan President Resigns: అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా.. కొత్త అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ?!
అప్గాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధికారాన్ని తాలిబన్లకు అప్పగిస్తునట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాబూల్‌ను పూర్తిగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
చాలా వేగంగా.. అఫ్గానిస్థాన్‌లోని కీలక నగరాలను హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించారని అఫ్గాన్ మంత్రి అబ్దుల్ సత్తార్ ప్రకటించారు. అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందన్నారు.
అఫ్గానిస్థాన్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. అధికార మార్పిడి కోసం చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యింది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై అఫ్గానిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్లు సమాచారం.
అయితే అంతకుముందే.. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తాలిబన్లు భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించమన్నారు. 'ఏ ఒక్కరి ప్రాణాలు, ఆస్తులు, గౌరవానికి హాని కలగదు. కాబుల్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేయం.' అని తాలిబన్లు చెప్పారు.
విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది కాబుల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. కీలక పత్రాలను నాశనం చేసి.. ఆదివారం అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో.. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ఎగురుతూ కనిపించాయి. కార్యాలయానికి చెందిన వాహనాలు ఆ ప్రాంతాన్ని వీడుతున్న దృశ్యాలు కనిపించాయి. దేశం మొత్తం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. దేశ రాజధాని కాబూల్‌లోకి కూడా ప్రవేశించారు తాలిబన్లు. ఇప్పటి వరకు 19 ప్రావిన్సులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు అఫ్గాన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తోంది అమెరికా. అష్రఫ్ ఘనీ అమెరికాకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వేలాదిమంది అఫ్గాన్ పౌరులు దేశం విడిచిపారిపోతున్నారు. తాలిబన్ల పాలన చీకటి రోజులు వాళ్లను వెంటాడుతున్నాయి.
అఫ్గాన్‌లోని ముఖ్యమైన నగరం జలాలాబాద్‌ను ఆదివారం తెల్లవారు జామున ఆక్రమించారు తాలిబన్లు. దీంతో తూర్పు ప్రాంతానికి, దేశ రాజధాని కాబుల్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. జలాలాబాద్ నగరంలోని గవర్నర్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు తాలిబన్లు. వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే.. భద్రతా దళాలు లొంగిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.
అయితే తాలిబన్లను అఫ్గాన్ సైన్యం ఎక్కడా ప్రతిఘటించలేదు. వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే లొంగిపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే దేశంలోని రెండో, మూడో అతిపెద్ద నగరాలైన హెరత్, కాందహార్లను తమ వశం చేసుకున్న తాలిబన్లు..నిన్న నాలుగో అతిపెద్ద నగరమైన మెజర్-ఏ- షరీఫ్‌ను ఆక్రమించారు. దీంతో ఉత్తర అఫ్గాన్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లినట్లయింది.
Also Read: Afghanistan News: తాలిబన్ల చేతిలో అఫ్గానిస్థాన్.. అధికార మార్పిడి కోసం చర్చలు