Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Hyderabad News: తన నివాసంపై ఓయూ జేఏసీ దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ప్రస్తుతం ఇది సంయమనం పాటించాల్సిన సమయమని.. తాము అదే చేస్తున్నామని అన్నారు.
Allu Aravind React On Attack On His Home: తన ఇంటిపై ఓయూ విద్యార్థుల జేఏసీ చేసిన దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అందరూ సంయమనం పాటించాలని.. అదే అందరికీ మంచిదని అన్నారు. 'ఆదివారం సాయంత్రం మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటింటాల్సిన సమయం. దేనికీ రియాక్ట్ కాకూడదు. ఇంటి ముందు ఆందోళన చేసిన వారిని పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. మీడియా వచ్చారు కదా అని.. ఈ ఘటనపై మేము స్పందించం. ఇలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు' అని విజ్ఞప్తి చేశారు.
ఇదీ జరిగింది
కాగా, హైదరాబాద్ అల్లు అర్జున్ నివాసంపై ఆదివారం సాయంత్రం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు దాడికి పాల్పడ్డారు. బన్నీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటి బయట బైఠాయించారు. కొందరు గోడలు ఎక్కి ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. కొందరు గోడ దూకి ఇంటి ఆవరణలోని పువ్వుల కుండీలను ధ్వంసం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
8 మంది అరెస్ట్
సమాచారం అందుకున్న పోలీసులు బన్నీ ఇంటికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థి సంఘాల నేతలు 8 మందిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడి ఘటనపై అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదు అందుకున్నారు. దాడి ఘటనపై ఇంట్లో ఉన్న వారి వద్ద వివరాలు సేకరించారు. సెక్యూరిటీ సూపర్వైజర్‌ను అడిగి సమాాచారం తెలుసుకున్నారు. ఆ సమయంలో బన్నీ ఇంట్లో లేరు. దాడి ఘటన నేపథ్యంలో బన్నీ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అటు, దాడి జరిగిన అనంతరం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీ నివాసానికి చేరుకున్నారు. ఘటన వివరాలను సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బన్నీ పిల్లలను కారులో తన ఇంటికి తీసుకెళ్లారు.
సంచలన విషయాలు
మరోవైపు, శనివారం నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తీరును తప్పుపట్టగా.. సాయంత్రం బన్నీ ప్రెస్ మీట్ పెట్టి సీఎం వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఈ క్రమంలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, తెలంగాణ పోలీసులు సైతం బన్నీపై ఫైరయ్యారు. ఘటన జరిగిన సమయంలో తాము థియేటర్ నుంచి వెళ్లిపోవాలని చెప్పినా.. అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ దీనికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోందని.. న్యాయపరమైన సలహాలతో ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.