Huzurabad Byelection : హడావుడిగా పథకాల అమలు ! ఏ క్షణమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ రాబోతోందా..?
శుక్ర, శనివారాల్లో హుజూరాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ రావొచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే సీఎం కేసీఆర్ పథకాలను ముందే ప్రారంభిస్తున్నారని అంచనా వేస్తున్నారు.
![Huzurabad Byelection : హడావుడిగా పథకాల అమలు ! ఏ క్షణమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ రాబోతోందా..? Election heat is on in Huzurabad assembly constituency Huzurabad Byelection : హడావుడిగా పథకాల అమలు ! ఏ క్షణమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ రాబోతోందా..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/15/e20117785822e33f40ad009a9bbcdc5d_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హుజూరాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ శుక్ర లేదా శనివారాల్లో వెలువడనుందని తెలంగాణ రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ అంశంపై నిర్దిష్టమైన సమాచారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన హడావుడిగా దళిత బంధు పధకాన్ని వాసాలమర్రిలో ప్రారంభించారు. వాస్తవంగా అయితే ఆగస్టు 16వ తేదీన హుజూరాబాద్‌లో ప్రారంభించాల్సి ఉంది. అలాగే ముందస్తు ఎన్నికల సమయంలో ఇచ్చిన 57 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ల హామీని కూడా అమలు చేస్తూ తాజాగా జీవో విడుదల చేశారు. ఇతర మరికొన్ని నిర్ణయాలను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
కోడ్ రాక ముందు పథకాలను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్..!
హుజూరాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు కొత్త పథకాలు ప్రకటించడానికి, అమలు చేయడానికి అవకాశం ఉండదు. ఆరు, ఏడు తేదీల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే రైతు బంధు పథకాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. అలా చేస్తే దళిత వర్గాల్లో ఆగ్రహం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన సీఎం కేసీఆర్ వాసాలమర్రి నుంచే పథకాన్ని ప్రారంభించేశారని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినా అది పాత పథకంగానే చెబుతూ అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఓటింగ్ కన్నా ముందు హుజూరాబాద్ దళితకుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున పంపిణీ చేసినట్లు అవుతుంది. అలాగే 57 ఏళ్లకు పెన్షన్ వయసు తగ్గించడం కూడా.
ఆస్పత్రి నుంచి నేరుగా హుజూరాబాద్ వెళ్లనున్న ఈటల..!
అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ఈ మాత్రం సమాచారం ఉండదా అనే అభిప్రాయం ప్రజల్లో కలగవచ్చు. బీజేపీ నేతలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్‌పై స్పష్టమైన సమాచారం ఉందని చెబుతున్నారు. పాదయాత్ర చేస్తూ అనారోగ్యానికి గురైన ఈటల రాజేందర్‌కు మోకాలికి ఆపరేషన్ జరిగింది. వైద్యులు పదిహేను రోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. అయితే గురువారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ఆ తర్వాత నేరుగా హుజూరాబాద్ వెళ్తున్నారు. అక్కడ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టే.. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈటల హుజూరాబాద్ వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకుని అక్కడ పని ప్రారంభించేశారు.
ఉపఎన్నిక షెడ్యూల్ వస్తుందనే అన్ని పార్టీల హడావుడి..!?
కాంగ్రెస్ పార్టీ కూడా నేడో రేపో నోటిఫికేషన్న వస్తుందన్న అభిప్రాయంతోనే ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ పరంగా పలు రకాల అభిప్రాయసేకరణలు జరిపి అభ్యర్థిపై ఓ అంచనాకు వచ్చారని అంటున్నారు. ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున చివరి క్షణంలోనే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల కోసం ఇప్పటికే ఇంచార్జులను నియమించిన రేవంత్ రెడ్డి.. వారితో పనులను సమన్వయం చేసుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయ పార్టీలన్నింటికీ రెండు రోజుల్లో హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ దిశగానే అధికార పార్టీ సహా అందరూ సన్నాహాలు చివరి దశకు చేర్చుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)