బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు, ఎన్ని కుట్రలు చేసినా తలొంచను - కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Arvind Kejriwal: బీజేపీలో చేరాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నారని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలంటూ తనపై ఆ పార్టీ ఒత్తిడి చేసిందని అన్నారు. కానీ...తాను అందుకు ఒప్పుకోలేదని, ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. తనపై ఎలాంటి కుట్రలు చేసినా ఎప్పటికీ వాళ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీలో చేరితే ఈ కేసులన్నీ మాఫీ చేస్తామని ఆశ చూపించారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
"నాపై బీజేపీ ఎన్ని కుట్రలైనా చేయనివ్వండి. కానీ నేను ఏ మాత్రం తలొంచను. బీజేపీలో చేరాలంటూ నాపై ఒత్తిడి చేస్తున్నారు. అలా అయితే నన్ను విడిచిపెడతానని చెబుతున్నారు. కానీ నేను ఒక్కటే చెప్పాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను బీజేపీలో చేరను. అది జరిగే పని కాదు"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
#WATCH | On laying the foundation stone of new school buildings in Kirari, Rohini, Delhi Chief Minister Arvind Kejriwal says, "... They ask us to join BJP saying they'll spare us. I said I would not join the BJP... We are doing nothing wrong." pic.twitter.com/9Tfggh4P5M
— ANI (@ANI) February 4, 2024
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఓ స్కూల్‌కి శంకుస్థాపన చేశారు కేజ్రీవాల్. ఆ కార్యక్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విద్య,వైద్య రంగాలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. మొత్తం బడ్జెట్‌లో కనీసం 4% కూడా నిధులు ఇవ్వడం లేదని మండి పడ్డారు. అదే తమ ప్రభుత్వం ఏటా 40% స్కూల్స్, హాస్పిటల్స్ కోసమే కేటాయిస్తోందని తేల్చి చెప్పారు. ఈ సమయంలోనే మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ప్రస్తావన తీసుకొచ్చారు. దర్యాప్తు సంస్థలు తమని వెంటాడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
"ఇవాళ అన్ని దర్యాప్తు సంస్థలు మా వెంట పడుతున్నాయి. మంచి స్కూల్స్ కట్టించడమే మనీశ్ సిసోడియా చేసిన తప్పు. మంచి హాస్పిటల్స్, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేయడమే సత్యేంద్ర జైన్ చేసిన పెద్ద తప్పు. మనీశ్ సిసోడియా పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేశారు. ఒకవేళ ఇదంతా చేయకపోయుంటే అసలు ఆయన అరెస్ట్ అయ్యే వారే కాదు. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని లొంగదీసుకోలేరు"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
#WATCH | Delhi: On laying the foundation stone of new school buildings in Kirari, Sector-41, Rohini, Chief Minister Arvind Kejriwal says, "... There's a new ray of hope among the poor that their kids will be able to get a good education in government-run schools. This a big deal… pic.twitter.com/oP0MzTx1lv
— ANI (@ANI) February 4, 2024