Generic Medicine: జనరిక్ మందులే రాయాలి, ఆ డాక్టర్లకు కేంద్రం ఆదేశాలు
Generic Medicine: కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో జనరిక్ మందులనే సిఫార్సు చేయాలని, అలా రాయని వైద్యులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది.
Generic Medicine: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు, వెల్నెస్ సెంటర్లలో ఇక నుండి తప్పకుండా జనరిక్ మందులను మాత్రమే రోగులకు రాయాలని కేంద్రం తేల్చి చెప్పింది. జనరిక్ మందులను సిఫార్సు చేయని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ మేరకు కేంద్ర సర్కారు హెచ్చరించింది.
'నిఘా ఉంటుంది, జాగ్రత్త!'
ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర సర్కారు ఆరోగ్య పథకం కింద నడిచే వెల్ నెస్ సెంటర్లు, పాలీ క్లినిక్ లలో ఇక నుండి రోగులకు జనరిక్ మందులను మాత్రమే సిఫార్సు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ వెల్లడించారు. కొంత మంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధ బ్రాండ్లకు చెందిన మందులను రోగులకు రాస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇక ముందు అలా ప్రముఖ బ్రాండ్లకు చెందిన మందులను రాసే డాక్టర్లపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయం మరవొద్దని తన ఆదేశాల్లో హెచ్చరించారు. తమ ఆధ్వర్యంలోని వైద్యులు జనరిక్ మందులనే రోగులకు సిఫార్సు చేసేలా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని అతుల్ గోయల్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వైద్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో మాదిరిగా ప్రైవేట్ మందుల కంపెనీల రిప్రజెంటేటివ్ లు ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద సంఖ్యలో వచ్చే సంప్రదాయానికి స్వస్తి పలకాలని చెప్పారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వారికి అనుమతి ఇవ్వాలని, కొత్తగా తయారైన మందుల గురించిన సమాచారాన్ని వైద్యులకు ఈ-మెయిళ్ల ద్వారా మాత్రమే వివరించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ సూచించారు.
జనరిక్ మందులు అంటే ఏంటి?
ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు చేస్తాయి. కొన్నేళ్ల పాటూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. అన్ని పరీక్షలు పూర్తయ్యాక వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. అవే బ్రాండెడ్ మందులు. ఆ మందు తయారీపై, ఆ ఫార్మా కంపెనీకి ఇరవై ఏళ్ల పాటూ పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో వేరే వాళ్లు ఆ మందును అదే ఫార్ములాతో తయారు చేయకూడదు. ఆ మందు తయారీలో చాలా ఖర్చు పెట్టామని సదరు కంపెనీ వాదిస్తుంది. ఆ సొమ్మును రాబట్టుకోవాలంటే ఆ మందును తాము మాత్రమే అమ్మాలని భావిస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా పేటెంట్ పేరుతో ఆ హక్కును సదరు కంపెనీకి ఇస్తాయి.
Also Read:సోనియాతో మాట్లాడిన తర్వాతే డీకే శివకుమార్ నిర్ణయం, ఏం జరగనుంది?
ఇరవై ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. అలా అదే ఫార్ములాతో మందులు తయారుచేసి తక్కువ రేటుకే జనరిక్ మందుల షాపుల్లో అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఇలా వేరే ఫార్మా సంస్థల ఫార్ములాతో మందును తయారు చేసి తక్కువ రేటుకే పేదల కోసం అమ్మే వాటిని జనరిక్ మందులు అంటారు. వీటిని కేవలం జనరిక్ మందుల షాపుల్లోనే అమ్ముతారు.సిప్లా, ఎస్ఆర్, రెడ్డీస్.. ఇవన్నీ బ్రాండెడ్ మందుల సంస్థలు.
జనరిక్ మందులను సిఫార్సు చేయకపోవడానికి కారణాలు
తక్కువ ధరలో వచ్చే జనరిక్ మందులు కాకుండా ఎక్కువ రేటుతో ఉండే ప్రైవేట్ సంస్థల మందులను వైద్యులు ఎందుకు సిఫార్సు చేస్తారు, ఎక్కువ ధర మందులు కొంటే ఆయా వైద్యులకు వచ్చే లాభం ఏంటి అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ప్రైవేట్ ఫార్మా కంపెనీలు ప్రతినిధులను నియమించుకుని ప్రతి ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లకు తమ మందుల గురించి వివరిస్తాయి. తమ మందులు రాయమని వారిని కోరతాయి. ఇలా రాసినందుకు గాను వైద్యులకు ఆయా సంస్థల రిప్రజెంటేటివ్ లు బహుమతులు, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీలు, రిసార్టుల్లో పార్టీలు ఇస్తారన్న విషయం బహిరంగ రహస్యమే. అలాంటి వాటికి ఆశపడి కొంత మంది వైద్యులు బ్రాండెడ్ మందులను సిఫార్సు చేస్తుంటారు.
Also Read: మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉందా?, పేమెంట్స్ ట్రెండ్ ఇకపై మారిపోతుంది