Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇండ్ల పథకం దరఖాస్తుదారుల వివరాలను సరిగ్గా నమోదు చేయాలని, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
Telangana News | నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో దరఖాస్తుదారుల వివరాలను పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. హైదరాబాద్ లోని సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, టి.జి.పి.ఎస్.సి. చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్-2, డైట్ చార్జీల పెంపు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభం
ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల దరఖాస్తులు అందాయని, ఈ దరఖాస్తులకు సంబంధించి సర్వే నిర్వహించి, ఇందులో దరఖాస్తుదారుల పూర్తి వివరాలను యాప్ లో నమోదు చేసి అర్హత గల వారికి ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి 500 ఇండ్లకు ఒక సర్వేయర్ ను కేటాయించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి ప్రతి రోజు కనీసం 25 ఇండ్ల చొప్పున 20 రోజుల లోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని, సర్వే నిర్వహించే ప్రాంతాలలో ఒక రోజు ముందుగా ప్రజలందరికీ తెలిసేలా టాం-టాం నిర్వహించాలని తెలిపారు. యాప్ వినియోగంపై సర్వేయర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
సర్వే నిర్వహణపై దరఖాస్తుదారులకు అనుమానాల నివృత్తి కొరకు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. యాప్ లో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేసేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ నుండి 40 శాతం పెంచిన డైట్ చార్జీలు అమలు చేయడం జరుగుతుందని, కార్యక్రమం ప్రారంభోత్సవం రోజున విద్యార్థుల తల్లిదండ్రులను కార్యక్రమానికి ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన ఆహారం అందించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతుందని, ఇప్పటి వరకు 99.9 శాతం పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 2 రోజులలో పూర్తి చేయాలని, సర్వే వివరాలు అందని ప్రముఖులను గుర్తించి వివరాలు సేకరించాలని, సర్వేకు సంబంధించి వివరాలు అందించని వారి దరఖాస్తులను ప్రజాపాలన సేవా కేంద్రాలలో స్వీకరించి పరిశీలించాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం సేవలు అభినందనీయమని అన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు
ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని టి.జి.పి.ఎస్.సి. చైర్మన్ బుర్ర వెంకటేశం అన్నారు. ఈ క్రమంలో ఈ నెల 15, 16 తేదీలలో జరుగనున్న గ్రూప్-2 పరీక్ష కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,51,943 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఈసారి పరీక్షలలో ప్రతి అభ్యర్థికి వారి వివరాలతో ఓ.ఎం.ఆర్. షీట్ అందించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాలలో అభ్యర్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు రవాణా, వైద్య సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు ఇతర వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ 3 కిలోమీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.
గ్రూప్-2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఇతర అధికారులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్ష కొరకు జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరిగిందని, పోలీసు బందోబస్తు, రవాణా ఇతర వసతులపై ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష నిర్వహణ కొరకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 14 మండలాలు, 2 మున్సిపాలిటీల నుండి 1,51,712 ప్రజా పాలన దరఖాస్తులు రాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.