Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Tiger Attack In Prathipadu : కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి మరోసారి హడలెత్తిస్తోంది. ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాపన్నధార ప్రాంతంలో ఆవును చంపితినడంతో అలజడి రేగింది.
Tiger Attack Latest News: రెండేళ్ల క్రితం కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలను దాదాపు మూడు నెలలపాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి మళ్లీ ఇదే నియోజకవర్గంలోని మన్యం ప్రాంతాలపై పంజా విసురుతోంది.. ప్రత్తిపాడు మండల పరిధిలోకి వచ్చే మణ్యం ప్రాంతంలో ఓ ఆవును చంపి తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాపన్నధార ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో బాపన్నధారతోపాటు బురదకోట, కొండ తిమ్మాపురం, ధారపల్లి, కొండపల్లి వంతాడ, పొదురుపాక, పాండవులపాలెం ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఏలేశ్వరం రేంజ్ అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నాలుగు గ్రామాల్లో భయం భయం..
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో సుమారు నాలుగు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి అయితే చాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పెద్దపులి నుంచి తమకు రక్షణ కావాలని, ఫారెస్ట్ అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ సత్వర చర్యలు చేపట్టడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. అవసరమైతే తామూ వచ్చి సహకారం అందిస్తామని సాద్యమైనంత త్వరలో పులిని పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బాపన్నధారలో ఆవును చంపిన పెద్దపులి..
ప్రత్తిపాడు మండల పరిధిలోని బాపన్న ధారలో పెద్దపులి ఆవును చంపి తిన్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దొరికిన పగ్ మార్కులు ఆధారంగా విచారణ జరిపిన ఫారెస్ట్ అధికారులు అవి పెద్దపులి పాదముద్రలని నిర్ధారించారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. రాత్రి వేళల్లో భయం భయంగా ఉంటున్నామని బాపన్నధారతోపాటు పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో పశువులును ఇంటివద్ద ఉంచుకుంటున్నామని, తలుపులు లేని ఇళ్లల్లోకి కూడా పులి చొరబడే ప్రమాదం ఉండడంతో భయంభయంగా గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
అప్రమత్తం చేసిన అధికారులు..
బాపన్నధార ప్రాంతంలో పెద్దపులి ఆవును చంపిన వేళ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తంచేస్తూ వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు కట్టించారు. గ్రామాల్లో సిబ్బంది తిరిగి పులి సంచారం ఉందని అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేశారు. ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వచ్చే ఈప్రాంతంలో నాలుగు బృందాలు పులి జాడ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం మూడు నెలలపాటు ఉత్కంఠ..
రెండేళ్ల క్రితం ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోనే పెద్దపులి సంచారం ఇక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది. మూడు నెలల పాలు దాదాపు 25కుపైగా పశువులపై దాడిచేసి చంపిన పరిస్థితి కనిపించింది. ఈ పశువుల యజమానులకు ఫారెస్ట్ అధికారులు నష్టపరిహారం అందించారు. పగటిపూట సమీపంలోని కొండప్రాంతంలోని దట్టమైన అడవుల్లో సంచరించి రాత్రివేళల్లో గ్రామాల్లోకి చొరబడి దాడులు చేసే పరిస్థితి కనిపించేది. పశువుల శాలల్లోకి చొరబడి వాటిని చంపి తిని తీవ్ర భయాందోళలను సృష్టించింది. చివరకు ఎట్టకేలకు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిని వీడి తుని నియోజకవర్గం ద్వారా అనకాపల్లికి వెళ్లిపోయిన పెద్దపులి ఆతరువాత విశాఖ అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేసింది.
Also Read: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!