Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకరి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజ్యసభ సీట్లు బయట వాళ్లకి ఇవ్వడం కొత్తకాదు కానీ ఆయన పేరు ఖరారు చేయడం మాత్రం తెలుగుదేశం వాళ్లకు కూడా షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆయనకు చానా చరిత్ర ఉంది మరి. మందలో ఒకడిగా కాదు.. వందలో ఒకడిగా నిలవాలన్నది ఆయన ఫిలాసఫీ. ఆ విషయం ఆయనే తన బయో వీడియోలో చెప్పుకున్నారు. ఆయన ఎవరనేగా... పేరు సానా సతీష్ బాబు. దాత,వ్యాపారావేత్త, సామాజిక వేత్త ఇంకా చానా..! ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా.. రేపో మాపో ఆయన కాబోయే రాజ్యసభ ఎంపీ. తెలుగుదేశం పార్టీ తరపున ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థుల్లో ఆయన ఒకరు. ఆ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఆయన ఎంపీ కావడం ఖాయం. రాజ్యసభ అంటే పెద్దల సభ అన్న అర్థం మారిపోయి చాలా కాలం అయింది కాబట్టి పార్టీలతో సంబంధం లేని వారు ఈ సీట్లలోకి వస్తుండటం పెద్ద విషయం కాదు. కానీ ఇంతకు ముందు ఉన్న ఎంపికలన్నిటిపైనా ఇష్టం లేకపోయినా వ్యతిరేకత అయితే ఉండేది కాదు. కానీ తెలుగుదేశంలో మొట్టమొదటి సారి ఈ ఎంపికపై బహిరంగంగానే వ్యతిరేకత వచ్చింది. నాయకుల స్థాయిలో ఎవరూ మాట్లాడకపోయినా పార్టీ క్యాడర్ మాత్రం అసంతృప్తితో ఉంది.