Karnataka New CM: సోనియాతో మాట్లాడిన తర్వాతే డీకే శివకుమార్ నిర్ణయం, ఏం జరగనుంది?
Karnataka New CM: సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు.
Karnataka New CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సీఎం గా ఎవరిని నియమించాలనే టెన్షన్ పట్టుకుంది. పట్టమంటే పాముకు కోపం, విడవమంటే కప్పకు కోపం అన్నట్లుగా మారింది కాంగ్రెస్ అధిష్ఠానం పరిస్థితి. ఓ వైపు సిద్ధరామయ్య మరోవైపు డీకే శివ కుమార్ లలో ఎవరిని సీఎం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే కేపీసీసీ అధ్యక్షుడు పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను సోమవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. ఆరోగ్యం సహకరించలేదని, అందుకే తాను ఢిల్లీ వెళ్లలేకపోయానని అన్నారు. మంగళవారం రోజు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలుస్తానని స్పష్టం చేశారు. ఆమెతో చర్చించాక తన నిర్ణయం చెబుతానన్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తనకు తెలియదని వివరించారు. మరోవైపు డీకే శివకుమార్ తో సోదరుడు డీకే సురేష్ తాను ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చలు జరిపానని, మంగళవారం డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చపు జరుపుతారని అంటున్నారు. అయితే డీకే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్యతో నేరుగా మాట్లాడి సీఎం అభ్యర్థి ఎవరనేది ఈరోజే తేలుస్తారని సురేష్ వెల్లడించారు.
సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మెగ్గు
మరోవైపు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ద రామయ్య వైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ బయల్దేరిన ముందు డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ కూడా ఈ సమాచారానికి ఊతమిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఓకే అంటున్న డీకే... తనకు బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశం లేదంటున్నారు. తనకు సోనియాగాంధీయే రోల్ మోడల్ అంటూ మరో హింట్ కూడా ఇచ్చారు. సిద్దారామయ్యకు అనుకూలంగా ఓ నిర్ణయానికి వచ్చిన హైకమాండ్ డీకేను ఎలా గౌరవిస్తుంది ఆయన వర్గీయులను ఎలా సంతృప్తి పరుస్తుంది అన్న దానిపైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నట్టు సమాచారం.
డీకే శివకుమార్ కు కేసులే పెద్ద మైనసా?
అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా డీకే శివకుమార్‌కు మంచి మార్కులే ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న కేసులు పెద్ద మైనస్ అవుతున్నాయి. పార్టీ విజయానికి చాలా కష్టపడినా వాటిని కారణంగా చూపుతున్న అధిష్ఠానం ఆయనకు సీఎంగా చేయడానికి వెనుకాడుతోంది. ఆయన్ని సీఎంగా చేస్తే కేంద్రం మరిన్ని ఇబ్బందులు పాల్జేసి కర్ణాటకలో మళ్లీ ఏదైనా సమస్య తీసుకొస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. అందుకే ఈ పరిస్థితిలో సిద్దరామయ్య లాంటి వారే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరని భావిస్తోంది. సిద్ధరామయ్యకు సీఎంగా ఓకే చెప్పిన తర్వాత ఆయన మంత్రివర్గంలో డీకే శివ కుమార్‌కు, ఆయన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఈయనతో పాటు పార్టీ విజయానికి కారణమైన మరికొన్ని వర్గాలకి కూడా డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్ట బోతున్నారని తెలుస్తోంది.
Also Read: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే రూ.42 లక్షలు స్వాహా - లబోదిబోమంటున్న టెకీ!
Also Read: జూన్ 12 నుంచి ఆఫీసులోనే మందు కొట్టొచ్చు- కొత్త పాలసీ తీసుకొచ్చి హర్యానా ప్రభుత్వం