Budget 2023: రైతులను కరుణిస్తారా? వ్యవసాయ రంగ బడ్జెట్‌పై పెరుగుతున్న ఆసక్తి
Union Budget 2023: వ్యవసాయ రంగ బడ్జెట్‌పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Agriculture Budget 2023:
2023-24 బడ్జెట్‌పై సామాన్యులతో పాటు రైతులూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగు రంగంపై నిర్మలా సీతారామన్ ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పలు అధ్యయనాలు ఇప్పటికే కొన్ని అంచనాలు వెలువరించాయి. వ్యవసాయ రంగానికి కేటాయించే పద్దుపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సమాచారం. వ్యవసాయంతో పాటు గ్రామీణ అభివృద్ధిపైనా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పలు కీలక పథకాలను ప్రకటించే అవకాశాలున్నాయి. రైతులకు నేరుగా లబ్ధి జరిగే పథకాలు రూపొందించినట్టు ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశముంది. SBI రీసెర్చ్..ఈ విషయమై కొన్ని సూచనలు కూడా చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో పాటు రాష్ట్రాలకు పలు ప్రోత్సాహకాలు అందించి రైతులకు అండగా నిలవాలని తెలిపింది. అదే విధంగా గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే సూచనలూ కనిపిస్తున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు రుణాలు పొందొచ్చు. అంటే నేరుగా బ్యాంకుల ద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది. తక్కువ వడ్డీకే ఈ రుణాలు ఇస్తారు. రూ.3 లక్షల రుణాల వరకూ ప్రభుత్వమే వడ్డీ చెల్లించే నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీటితో పాటు పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఇచ్చే నిధుల పరిమితినీ పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏటా రైతులకు ఈ పథకం కింద రూ.6,000 అందిస్తోంది కేంద్రం. మూడు వాయిదాల్లో ఈ సహకారం అందిస్తోంది.