Bangalore Sunroof Tragedy: తండ్రి నిర్లక్ష్యం కొడుకు ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ వీడియో చూశాక అయినా మనం మారుతామా..? సన్‌రూఫ్ విషయంలో జాగ్రత్త లేకపోతే ఇంతే..!
Bangalore Sunroof Tragedy: కారు సన్‌రూఫ్ పై నుంచి చూస్తున్న ఓ పిల్లాడు ఐరన్ బార్ కొట్టుకుని తీవ్ర గాయాలపాలైన వీడియో సోషల్‌మీడియాలో తిరుగుతోంది. ఇప్పటికైనా మనలో మార్పు వస్తుందా..?

Bangalore Sunroof Video: మన ఉత్సాహం మాటునే ప్రమాదం పొంచి ఉంటుంది.. సరదా వెనుకే విషాదం వెన్నంటి ఉంటుంది. అప్రమత్తంగా లేకపోయినా.. అజాగ్రత్తగా ఉన్నా జరిగే నష్టాన్ని పూడ్చలేం. అలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో జరిగింది. కారు సన్‌రూఫ్‌పై నుంచి రోడ్డును చూడాలన్న ఓ బాలుడ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదాన్ని చూసుకోకుండా.. ఆ తండ్రి చేసిన డ్రైవింగ్ తనకు తీవ్ర వేదన మిగిల్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
బెంగళూరులో సన్‌రూప్‌పై నించుని గాయపడ్డ బాలుడు
బెంగళూరు నగరంలో శనివారం సాయంత్రం ఓ తండ్రీ కొడుకులు కొత్త కారులో షికారు చేశారు. కొడుకు ఉత్సాహపడ్డాడు అని ఆ తండ్రి కారు సన్‌రూఫ్ ఓపెన్ చేశాడు.. కొంత దూరం బాగానే ఉంది కానీ… విద్యారణ్యపురలోని ఓ వీధిలో అనుకోని సంఘటన జరిగింది. అక్కడ నుంచి రోడ్డు ఎక్కే క్రమంలో కారును నడుపుతున్న తండ్రి.. తన కుమారుడు తల బయటపెట్టి చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయి.. ఏమరుపాటుతో కారును పోనిచ్చాడు. ఆ వీధిలోకి భారీ వాహనాలు రాకుండా ఓ పెద్ద ఇనుప రాడ్‌ను అడ్డంగా ఉంచారు. కారులో ఆ రాడ్‌ను దాటే సమయంలోఆ బారియర్ అడ్డుగా ఉన్న విషయాన్ని బాలుడు గుర్తించలేకపోయాడు. గుర్తించినా తను కిందకు కూర్చునే సమయం దొరకలేదు. దీంతో బారియర్ పిల్లాడి తలకు బలంగా కొట్టుకుంది. ఇదంతా వెనుక ఉన్న మరో కార్‌లోని కెమెరాలో రికార్డ్ అయింది. పాపం పిల్లాడికి అలా తగలడం వీడియోలో చూసిన వారంతా చలించి పోయారు..
సోషల్‌మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. బాధ్యాత లేని పేరెంట్ అంటూ ఆ తండ్రిని చాలా మంది నిందించారు. సన్‌రూఫ్‌లను నిషేధించాలని.. ఇండియన్ రూట్లకు సన్‌రూఫ్‌లు సేఫ్ కాదని.. ఇలా రకరకాల వాదనలు జరిగాయి. ఆ ఇనుప రాడ్ తగిలి తీవ్రంగా గాయపడ్డ పిల్లాడు.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. తలకు చాలా బలంగా దెబ్బతగిలిందని వైద్యులు చెబుతున్నారు.
తండ్రిపై కేసు
బాధ్యతారాహిత్యంగా వాహనాన్ని నడిపారని తండ్రిపై కేసు నమోదైంది. మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు.. అందులో నుంచి ఎవ్వరూ బయటకు రాకూడదు.. పిల్లలను బయటకు రావడానికి అంగీకరించడంతో పాటు.. ప్రమాదానికి కారణమైనందుకు ఆయనపై కేసు నమోదైంది.
సన్‌రూఫ్‌లపై చర్చ
ఈ ప్రమాదం తర్వాత ఇప్పుడు వాహనాల్లోని భద్రతపై చర్చ జరుగుతోంది. వాహనాల్లో సన్‌రూఫ్ వినియోగంపై నియంత్రణ ఉండాలన్న వాదనలు వస్తున్నాయి. సన్‌రూఫ్ అనేది వెంటిలేషన్ కోసం మాత్రమే అని దానిలో నుంచి మనుషులు బయటకు రాకూడదని చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే దానిని వినియోగించాలన్నారు. కొంతమంది వేగంగా హైవేలపైన వెళుతున్నప్పుడు కూడా సన్‌రూఫ్‌ల ద్వారా బయటకు వస్తున్నారు. హైవేలపై గాలి వేగానికి మెడ ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. చిన్న పిల్లల్లో ఎముకలు ధృఢంగా ఉండవ్.. ఇలాంటి వారు 100 కిలోమీటర్ల వేగంతో గాలిని చీల్చుకుని వేళ్లే వాహనంలో బయట ఉండటం ప్రమాదకరం.. దీనిపై మరింత చర్చ జరగాలని ఓ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.





















