Adani Row: అదానీ వివాదంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం, నిపుణుల కమిటీ ఏర్పాటు
Adani Row: అదానీ వివాదంపై విచారణకు సుప్రీం కోర్టు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.
Supreme Court Committee:
నిపుణుల కమిటీ ఏర్పాటు
అదానీ - హిండన్‌బర్గ్ వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హిండన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో ఈ కమిటీ విచారించనుంది. రిటైర్డ్ జడ్జ్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. బ్యాంకింగ్ రంగ నిపుణులు కేవీ కామత్,ఓపీ భట్‌తో పాటు ఇన్‌ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని, మరో రిటైర్డ్ జడ్జ్ జేపీ దేవ్‌ధర్ ఈ కమిటీ సభ్యులిగా నియమించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెబీ తన విచారణను కొనసాగించి రెండు నెలల్లోగా ఈ అంశంపై రిపోర్ట్‌ను సమర్పించాలని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విధానాల్లో ఎలాంటి మార్పులు అవసరమో ఈ నిపుణుల కమిటీ సూచించనుంది. ఫ్రేమ్‌వర్క్‌లో చేపట్టాల్సిన సంస్కరణలనూ ప్రస్తావిస్తుంది. ఇన్‌వెస్టర్లకు భరోసా ఇచ్చే విధంగా విధానాల్లో మార్పులు తీసుకురావాలని చెబుతోంది సుప్రీం కోర్టు. అదానీ గ్రూప్ నిబంధనలు ఉల్లంఘించిందా..? మ్యానిప్యులేట్ చేసిందా..? అనే అంశాలపై సెబీ కచ్చితంగా విచారమ చేపట్టాలని ఆదేశించింది.
ఇటీవలే అదాని హిండన్‌బర్గ్ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీ నియమించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు SEBI కొందరి పేర్లను ప్రతిపాదించింది. SEBI తరపున వాదించే సోలిసిటర్ జనరల్ ఈ వివరాలు కోర్టుకి సమర్పించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కమిటీకి లీడర్‌గా నియమించే నిర్ణయం కోర్టుదేనని తేల్చి చెప్పారు సోలిసిటర్ జనరల్. అయితే...SEBI ప్రతిపాదించిన పేర్ల జాబితాను సీల్డ్ కవర్‌లో అందించడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలో కోర్టే నిర్ణయిస్తుందని, అలా అయితే తప్ప పారదర్శకత ఉండదని తేల్చి చెప్పింది.
"మేం ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఆమోదిస్తే అది ప్రభుత్వం నియమించిన కమిటీ అయిపోతుంది. ఈ కమిటీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలి"
-సుప్రీంకోర్టు ధర్మాసనం
ప్రస్తుతం విధుల్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జ్ నేతృత్వంలో కమిటీని నియమించలేమని, ఆ బాధ్యతను మాజీ జడ్జ్‌కే అప్పగిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. ఫిబ్రవరి 10 వ తేదీన సుప్రీం కోర్టు "ప్రత్యేక కమిటీ" నియమించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అంగీకరించిన కేంద్రం ఆ కమిటీలోని సభ్యుల పేర్లనూ కోర్టు ముందుంచింది. అయితే...ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ నియమించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ SEBI అన్ని విధాలుగా పారదర్శకంగా ఉందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో ప్రస్తుత సమస్యని పరిష్కరించవచ్చని వెల్లడించింది. ప్యానెల్‌లో ఎవరెవరుంటారో వాళ్ల పేర్లను సీల్డ్‌కవర్ ద్వారా వెల్లడించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టుని కోరింది. కానీ...సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించ లేదు.
Also Read: Bank Holidays: వచ్చే వారంలో బ్యాంకులు 5 రోజులు బంద్, పనుంటే ఇప్పుడే పూర్తి చేసుకోండి