Ramadan: రంజాన్ ఉపవాసంలో ఖర్జూరాలకు ఎందుకంత ప్రాముఖ్యత? సైన్సు ఏం చెబుతోంది?
రంజాన్ పవిత్ర మాసం. ఆ నెలంతా ఖర్జూరాలకు మహా డిమాండ్
పవిత్ర మాసమైన రంజాన్ మొదలైంది. 30 రోజుల పాటూ కఠోర ఉపవాసాన్ని పాటిస్తారు ముస్లిం సోదరులు. ఉపవాస దీక్షలో భాగంగా సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారాన్ని సెహరీ అని, సూర్యస్తమయం తరువాత తినే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. సెహరీ తిన్నాక మళ్లీ రాత్రి ఇఫ్తార్ వేళల వరకు మంచి నీళ్లు కూడా తాగరు. ఇఫ్తార్ వేళ ఖర్జూరం తినడం ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు. రంజాన్ ఉపవాసాల వేళ ఏ ఆహారానికి లేని ప్రాముఖ్యత ఖర్జూరాలకే ఎందుకొచ్చింది?
నమ్మకం...
దైవ ప్రవక్త మహమ్మద్‌కు ఖర్జూరాలంటే చాలా ఇష్టమట. ఆయనను అల్లా దైవదూతగా నమ్ముతారు. అల్లాను ప్రార్థించే ముందు ఖర్జూరాలు తినడం ద్వారా తన ఉపవాస దీక్షను విరమించేవారు మహమ్మద్. అప్పట్నించే ఇది ఆనవాయితీగా వస్తుందని ప్రజల నమ్మకం.
సైన్సు ఏం చెబుతోంది?
మిగతా ఆహారాలతో పోలిస్తే ఖర్జూరం చాలా ఆదర్శవంతమైనది. మనిషి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే కఠోర ఉపవాస దీక్ష తరువాత ఖర్జూరాలు తినడం చాలా మంచి ఎంపిక అని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. ఖర్జూరాలలో రాగి, సెలీనియం, మెగ్నిషియం పుష్కలంగా ఉంటాయి. ఉపవాసం చేశాక ఇవి చాలా అవసరమైన పోషకాలు. అంతేకాదు ఖర్జూరాలలో కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి. వీటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా లభిస్తాయి. ఇది దీర్ఘ ఉపవాస కాలం తరువాత తక్షణమే శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తాయి. నీరసం ఇట్టే మాయమవుతుంది. నిజం చెప్పాలంటే ఖర్జూరాలు ఎనర్జీ డ్రింకులకంటే మెరుగ్గా పనిచేస్తాయి. పోషకాహార నిపుణులు సైతం ఉపవాసం తరువాత తక్షణమే తినాల్సిన ఆహారాలలో ఖర్జూరాలదే ప్రధమస్థానమని చెబుతున్నారు.
నెలవంక దర్శనం
ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఏప్రిల్ 2, శనివారం నుంచి మొదలైంది. ఆదివారం తెల్లవారు జాము నుంచి ఉపవాసాలు చేయడం ప్రారంభించారు ముస్లిం సోదరులు. ఉదయానే నాలుగ్గంటల సమయంలో ఆహారాన్ని తింటారు. ఆ తరువాత సూర్యస్తమయం అయ్యాకే ఉపవాసాన్ని విరిమించి ఇఫ్తార్ స్వీకరిస్తారు. ఈ మధ్య కాలంలో మంచి నీళ్లు కూడా తాగరు. అందుకే దీన్ని కఠిన ఉపవాసం అంటారు. అంతేకాదు రంజాన్ మాసంలో జకాత్ పేరుతో పేదలకు దానధర్మాలు నిర్వహిస్తారు. అందుకే రంజాన్ మాసాన్ని పవిత్రమాసమని పిలుస్తారు.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టే