Anxiety: కనిపించని కిల్లర్ యాంగ్జయిటీ, ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాల్సిందే
చాలా మందికి యాంగ్జయిటీ అంటే ఏంటో? అది కూడా ఒక మానసిక సమస్య అని తెలుసుకోలేరు.
మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ వేధిస్తుంటాయి. కూర్చోలేరు, నిల్చోలేరు. అంతా బావున్నట్టే కనిపిస్తుంది, కానీ మనసులో మాత్రం ఏదో తెలియని వ్యధ. ఏ పనీ సరిగా చేయలేరు. ఇలా అనిపిస్తున్నప్పుడు చాలా మందికి తమకు వచ్చిన సమస్యేంటో కూడా తెలియదు. ఆందోళనగా మాత్రం అనిపిస్తుంది. వ్యక్తులతో మాట్లాడాలన్నా, వీధి దాటడమన్నా కూడా భయం. ఏదో హాని జరిగిపోతుందేమో అన్న భీతి. ఇవన్నీ యాంగ్జయిటీ ఉన్న మనిషిలో కలుగుతాయి. మనిషిలో భావోద్వేగాలు అధికంగా, ఆందోళనగా మారినప్పుడు చాలా తీవ్రమైన ప్రభావాలను చూపిస్తాయి. దీనికి కచ్చితంగా వైద్యుల సలహా అవసరం. మందులు వాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. యాంగ్జయిటీ బారిన పడిన వారిలో నిద్రలేమి సమస్య కూడా రావచ్చు. కాబట్టి నిద్రకు కూడా వైద్యులు మందులు సూచిస్తారు. యాంగ్జయిటీ సమస్యను గుర్తించకుండా అలాగే వదిలేస్తే మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. తద్వారా ప్రధాన అవయవాల పనితీరులో కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి యాంగ్జయిటీ లక్షణాలు ముందుగా తెలుసుకోవాల్సిన అందరికీ ఉంది.
ఇవే లక్షణాలు
1. మీకు తెలియకుండా చేతి గోళ్లు కొరకడం, పెదవులు కొరకడం చేస్తుంటారు.
2. పొట్టలో గాభారాగా ఉంటుంది. ఆహారం తినలేరు. ఒక్కోసారి భోజనం చేస్తున్నప్పుడు కడుపునొప్పి కూడా వస్తుంది.
3. గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. దీన్నే చాలా మంది గుండె దడ అని చెబుతుంటారు.
4. ఏ పనిపైనా ఏకాగ్రత ఉండదు.
5. తీవ్రమైన అలసట
6. నిత్యం అశాంతిగా అనిపించడం
7. నిద్ర సరిగా పట్టకపోవడం
8. ఛాతీలో నొప్పి
9. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం
యాంగ్జయిటీ మొదలైన వ్యక్తిలో పైన చెప్పిన అన్ని లక్షణాలు కనిపించాలని లేదు. వీటిలో కనీసం మూడు కనిపించినా కూడా జాగ్రత్త పడాలి. వైద్యుడిని సంప్రదించినప్పుడు సమస్య తీవ్రతను బట్టి మందులు ఇస్తారు. మీతో మాట్లాడాకే వారు సమస్యను అంచనా వేస్తారు. ఒక్కోసారి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మందులు వాడాల్సి రావచ్చు. యాంగ్జయిటీ వంటివి దీర్ఘకాలంగా చికిత్స అందించాల్సిన సమస్య. మందులు వేయని రోజు మళ్లీ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అలాగే నిద్రను తెచ్చే ట్యాబ్లెట్ కూడా ఇస్తారు. ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బలమైన ఆహారాన్ని, సాత్వికాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.