Samosa, Jalebi, Pizza : సమోసా, జిలేబి, పిజ్జా వీటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం? ఆరోగ్యానికి తెచ్చే ముప్పులివే
Unhealthy Snacks Warning : సమోసా, జిలేబి, పిజ్జా రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో ఏది అత్యంత ప్రమాదాకరమంటే..

Unhealthy Snacks : సాయంత్రం స్నాక్స్ అంటే చాలామందికి గుర్తొచ్చేవి సమోసా, జిలేబి. మరికొందరు పిజ్జాను ఎక్కువ ఇష్టంగా తింటారు. ఈ వెస్ట్రన్ డిష్‌ను పార్టీల్లో, కెఫేలకు వెళ్లినప్పుడు ఎక్కువగా తింటూ ఉంటారు. పిల్లలు కూడా పిజ్జాను ఇష్టంగా తింటారు. అయితే ఈ మూడు కూడా నోటికి మంచి రుచిని ఇస్తాయి. అయితే వీటిని వేటితో తయారు చేస్తారు? వీటిని తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఇటీవలె సమోజా, జిలేబిలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సిగరెట్ జాబితాలో దీనిని చేర్చేసింది.
ఈ లిస్ట్‌లో పిజ్జా లేదు కానీ.. చాలామంది సమోజా, జిలేబీలపై హెచ్చరికలు ఇవ్వడంతో పిజ్జా హెల్తీ కాదంటూ దానిపై ఎందుకు ఆంక్షలు ఇవ్వలేదంటూ అడుగుతున్నారు. ఈ మేటర్ పక్కన పెడితే.. అసలు ఈ మూడింటిలో ఉపయోగించే పదార్థాలు ఏంటి? వాటిలోని పోషకవిలువలు ఏంటి? వాటిని తింటే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కరుణ చతుర్వేది ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రతి ఆహారానికి ఓ కథ ఉంటుంది. అవి రుచి మాత్రమే కాదు.. పోషణ, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ మూడింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరమో తెలుసుకుందామంటూ ఈ విషయాలు తెలిపింది.
సమోసా
సమోసా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్. దీనిలో బంగాళాదుంపలు, మసాలా దినుసులతో లోపలి కర్రీని మైదాతో సమోసాను తయారు చేస్తారు. అనంతరం డీప్ ఫ్రై చేస్తారు. మైదా ఉపయోగించడం, డీప్ ఫ్రై కారణంగా.. సమోసాలో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
ఒక్క సమోసాలో దాదాపు 300 కేలరీలు ఉంటాయి. పదేపదే వేడి చేసిన నూనెలో దీనిని వేయించినప్పుడు ఇది క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంట్లో తయారు చేసుకుంటే ఇలాంటి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.
జిలేబి
జిలేబిలో శుద్ధి చేసిన చక్కెర ఉంటుంది. ఇది ప్రమాదకరమైన ఇబ్బందులు ఇస్తుంది. ఒక జిలేబిలో 100-150 కేలరీలు ఉంటాయి. కానీ దీనిలో ఫైబర్, ప్రోటీన్ కూడా ఉండదు. అలాగే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పిజ్జా
పిజ్జాలో చీజ్, శుద్ధి చేసిన పిండి, ప్రాసెస్ చేసిన మీట్ ఉంటుంది. దీనివల్ల రుచి గొప్పగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక స్లైస్ పిజ్జాలో 250-350 కేలరీలు ఉంటాయి. ఇందులో సంతృప్త కొవ్వు, సోడియం, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. బరువు కూడా పెరిగిపోతారు.
ఏది ప్రమాకరమైనదంటే..
న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కరుణ చతుర్వేది ప్రకారం.. సమోసా, పిజ్జా, జిలేబి మూడు కూడా ఎక్కువగా తీసుకుంటే హానికరమే. సమోసాలో ట్రాన్స్ ఫ్యాట్, డీప్ ఫ్రై ప్రధాన ప్రమాదంగా ఉంటాయని.. జిలేబిలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. పిజ్జాలో సంతృప్త కొవ్వు, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. ఇవి గుండె, కాలేయానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి మూడు ప్రమాదకరమే. ఎప్పుడైనా తినాలనుకుంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి కానీ.. ఎక్కువగా, ఎక్కువసార్లు తీసుకుంటే కచ్చితంగా మూడు ప్రమాదమేనని చెప్తున్నారు. గుర్తించుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. సమోసా, జిలేబిని అప్పటికప్పుడు తయారు చేస్తారు. కానీ పిజ్జా బ్రెడ్‌ను ముందే తయారు చేస్తారు.






















