Telugu Recipes: విఘ్నాధిపతికి గోధుమ కుడుముల నైవేద్యం...
వినాయకచవితి రోజున కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలలో కుడుములు ఒకటి. నిత్యం బియ్యం పిండితోనే చేయాలా? ఈసారి గోధుమ రవ్వతో చేసి చూడండి.
బొజ్జ గణపతి పూజలో ముఖ్యమైనవి నైవేద్యాలే. ఉండ్రాళ్లు, పాయసం, పులిహోర, కుడుములు... ఇవి కచ్చితంగా భక్తులు వినాయకుడిని పూజించి నివేదిస్తారు. కుడుములు ప్రతిసారి బియ్యం రవ్వతోనో, బియ్యం పిండితోనో చేస్తుంటారు. వాటి స్థానంలో గోధుమ రవ్వను కూడా తీసుకుని చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. అందులోనూ బెల్లాన్ని చేర్చి తీసిగా వచ్చేలా చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి.
కావాల్సిన పదార్థాలు
గోధుమ రవ్వ - అర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
కొబ్బరి తురుము - మూడు టేబుల్ స్పూన్లు
బెల్లం పొడి - అరకప్పు
యాలకుల పొడి - అర టీస్పూను
నెయ్యి - ఒక టేబుల్ స్పూను
పెసరపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
1. వంట మొదలుపెట్టడానికి అరగంట ముందే పెసరపప్పు నానబెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి నానబెట్టని పెసరపప్పును వేయించాలి.
3. పెసరపప్పులో తురిమిన బెల్లం, నీళ్లు పోయాలి.
4. బెల్లం కరిగి పాకంలా మారుతుంది. ఆ సమయంలో గోధుమ రవ్వ, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి.
5. ఆ మిశ్రమంలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. స్టవ్ చిన్న మంట మీద పెట్టి, ఉండలు కట్టకుండా తరచూ కలుపుతూ ఉండాలి.
6. మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
7. వేడి కాస్త చల్లారాక చేతులకు నెయ్యి పూసుకుని ఉండల్లా చుట్టాలి.
8. ఆ ఉండలను ఆవిరిపై పదినిమిషాలు ఉడికించుకుంటే గోధుమ కుడుములు రెడీ.
9. ఆవిరి మీద ఉడికించేందుకు ఇడ్లీ పాత్రను ఉపయోగించుకోవచ్చు.
పోషకాలు
గోధుమ రవ్వలో కెలోరీలు తక్కువగా ఉండి, పోషకాలు అధికంగా లభిస్తాయి. షుగర్ రోగులు కూడా గోధుమ రవ్వను తినవచ్చు. అలాగే ఇందులో వాడిన మరొక ముఖ్య పదార్థం బెల్లం. ప్రతి రోజు భోజనం తరువాత చిన్న బెల్లం ముక్క తినమని చెబుతుంటారు పెద్దలు. ఇందులో ఉండే పొటాషియం, సోడియం శరీరంలోని ఆమ్ల స్థాయిలను నియంత్రించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. ఇందులో ఐరన్ కూడా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తుంది. గర్భిణీలకు కూడా బెల్లం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండు మాంగనీస్ పేగులలో ఉన్న ఇన్ ఫెక్షను ను దూరం చేస్తుంది.
Also read: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...
Also read: పిల్లల లంచ్ బాక్సు రెసిపీ... కొత్తిమీర రైస్
Also read: ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి