Types of biryani in india: ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి
బిర్యానీ పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. రెగ్యులర్ గా దొరికే బిర్యానీలు అందరూ తింటారు. ఇదిగో ప్రత్యేక బిర్యానీలు ప్రయత్నించండి.
ఒక్కో వంటకం ప్రాంతాన్ని బట్టి కొత్త రుచిని, కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. మన నేషనల్ క్రష్ బిర్యానీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకంగా చేస్తారు. మీరు హార్డ్ కోర్ బిర్యానీ లవర్ అయితే, ఇదిగో ఈ బిర్యానీ వెరైటీస్ గురించి కూడా తెలుసుకోండి.
మొఘల్ బిర్యానీ
మొఘలుల రాకతో ఈ మొఘల్ బిర్యానీ మన దేశానికి పరిచయం అయ్యింది. దేశం అంతటా ఇది వ్యాపించింది. నిజానికి దీన్నే ప్రామాణికమైన బిర్యానీగా భావిస్తారు. మొఘలుల కాలంలో దర్భారులో ఉన్న షామీ బావర్చీలు (మహారాజుగారి కోసం ప్రత్యేకంగా వంటలు చేసే వంటగాళ్లు) దీన్ని వండేవారు. మాంసాన్ని మసాలా దినుసులతో మారినేట్ చేసి, కేవరా అని పిలిచే సువాసన భరితమైన మొక్క నుంచి తీసిన రసాన్ని చల్లి బిర్యానిని వండే వారు.
మోటీ బిర్యానీ
ఇది ముత్యాల బిర్యాని. దీన్ని అవధ్ రాజ్యాన్ని పాలించిన నవాబ్ వాజిద్ అలి షా తన కోసం ప్రత్యేకంగా వండించుకునేవారు. ఈయన ఆ రాజ్యాన్ని 18వ శతాబ్ధంలో పాలించారు. ఆధునిక భారతావనిలో ఆ రాజ్య భూభాగం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉడకబెట్టిన గుడ్లపై తినదగిన వెండి, బంగారపు రేకులను చుట్టి ముత్యాల్లా తయారుచేస్తారు. ఆ ముత్యాల్లాంటి గుడ్లను, చికెన్, బియ్యం, మసాలా దినుసులతో కలిపి మోటీ బిర్యానీని తయారుచేసేవారు.
కోల్ కతా బిర్యాని
మిగతా బిర్యానీలతో పోలిస్తే కోల్ కతా బిర్యానీ కాస్త వెరైటీగా ఉంటుంది. దీనిలో కచ్చితంగా ఉడకబెట్టిన బంగాళాదుంపని వాడతారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదైనా సరే బంగాళాదుంప ఉండాల్సిందే. మాంసం రుచికి బంగాళాదుంప రుచి కూడా తోడై కొత్త అరోమాని అందిస్తుందని అంటారు కోల్ కతా బిర్యానీ లవర్స్.
మీన్ బిర్యానీ
చికెన్ కు బదులుగా చేపతో దమ్ బిర్యానీని వండుతారు. అదే మీన్ బిర్యాని. ముఖ్యంగా కేరళలో ఇది చాలా పాపులర్. మసాలా పేస్టును దట్టించిన చేపలు, వేయించిన జీడిపప్పులు చేర్చి ఈ బిర్యానీని వండుతారు. కేరళలోని కొందరు దీనికి కొబ్బరికోరుని, నల్లని కొకుమ్ (కేరళలో దొరికే ఓ పండు) కూడా చేరుస్తారు.
అచారి బిర్యాని
ఈ బిర్యాని దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు చెందినది. ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. దీని రుచిలో అచారి మసాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అచారి మసాలాను ఆవాలు, మెంతులు, వాము, ఎండు మామిడి పొడి, నల్ల జీలకర్ర గింజలు, అజ్వాన్, ఇంగువ మొదలగువాటితో తయారు చేస్తారు.
జోధ్ పురి బిర్యాని
చాలా మందికి తెలియని బిర్యాని వెర్షన్ ఇది. కాకపోతే ఇది శాఖాహార బిర్యాని. బియ్యం, అనేక కూరగాయలతో దీన్ని వండుతారు. రాయల్ టచ్ ఇవ్వడానికి డ్రై ఫ్రూట్స్ ను కూడా జోడిస్తారు. ఇది క్లాసిక్ పులావ్ ను పోలి ఉంటుంది.
కటకి బిర్యాని
ఒడిషాలోని కటక్ రీజియన్ లో లభించే బిర్యాని ఇది. అందుకే దీన్ని కటకి బిర్యాని అంటారు. మటన్ తో దీన్ని తయారుచేస్తారు. ఈ బిర్యాని పర్షియాలో పుట్టిందని కొంతమంది సైనికుల ద్వారా ఒడిషా చేరిందని చెబుతారు. ఆ రోజుల్లో సైనికుల కోసం భారీగా కటకి బిర్యాని వండి వడ్డించేవారని చెబుతారు.
Also read: రొయ్యల నిల్వ పచ్చడి ఇలా చేసి చూడండి... అదిరిపోతుంది
Also read: కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి
Also read:నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?