Best Places to Visit in Thailand : సంక్రాంతి సెలవుల్లో విహార యాత్రలకు ప్లాన్ చేస్తున్నారా? థాయ్‌లాండ్ వెళ్లండి, వీసా కూడా అక్కర్లేదు!
Thailand visa-free: ఈ సంక్రాంతి సెలవులకు ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? వీసా అవసరం లేకుండానే థాయిలాండ్ చుట్టేయోచ్చు.8 మోస్ట్ బ్యూటీఫుల్ ప్లేసేస్ గురించి తెలుసుకుందాం.
Best Places to Visit in Thailand: సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. మరి, ఊర్లో పండుగను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? లేదా ఫ్యామిలీతో విహార యాత్ర ప్లాన్ చేస్తున్నారా? అయినా.. పండుగ పూట విహారయాత్రలకు ఎవరు వెళ్తారు అని అనుకుంటున్నారా? ఒక వేళ మీరు ఈ సెలవులను విహారయాత్ర కోసం కేటాయించాలని అనుకుంటే మాత్రం.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే.. థాయ్‌లాండ్ మన భారతీయులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశాన్ని సందర్శించడానికి వీసా, పాస్‌పోర్ట్ అవసరం లేదని ప్రకటించింది. ఈ అవకాశం కేవలం ఈ ఏడాది మే 10వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కుదరకపోయినా వేసవి సెలవులకైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి బుక్ చేసుకుంటే టికెట్లు కూడా తక్కువ ధరకు లభిస్తాయి.
థాయ్‌లాండ్ వెళ్తాం సరే. అక్కడ చూడదగిన ప్రాంతాలు ఏమున్నాయ్? అనేగా ఆలోచిస్తున్నారు? ఇవిగో ఈ వివరాలు మీ కోసమే.
ఈ ఏడాది మే 10 వరకు భారతీయులకు ఎలాంటి వీసా లేకుండానే థాయిలాండ్ వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు థాయిలాండ్ టూరిజం అథారిటీ గవర్నర్ తపాని కియాఫాయిబుల్ ఇటీవల వెల్లడించారు. ఈ అవకాశం కజకిస్తాన్, చైనా పర్యాటకులకు కూడా కల్పించారు. అయితే, ఆయా దేశాలకు కేవలం మూడు నెలలు మాత్రమే అవకాశం ఇచ్చింది. భారతీయులకు మాత్రం ప్రత్యేకంగా ఆరు నెలలు ఇచ్చింది. థాయిలాండ్ కల్పించిన నో వీసా పాలసీలో భాగంగా 30 రోజులపాటు భారతీయులు థాయిలాండ్ దేశంలో పర్యటించవచ్చు.
బ్యాంకాక్:
థాయిలాండ్‌కు వెళ్లే చాలా మంది ప్రయాణికులు బ్యాంకాక్ వెళ్తారు. గతేడాది ప్రపంచంలోని అన్ని నగరాల్లో కంటే బ్యాంకాంక్ నగరానికి పర్యాటకులు అత్యధికంగా వెళ్లారట. ఇక్కడ మార్కెట్లు, బీచ్ లు, ప్రసిద్ధ ఉద్యానవాలు, లాంచింగ్ ప్యాడ్ పర్యాటకులను కట్టిపడేస్తాయి. కనీసం ఇక్కడ రెండు రోజులు గడిపినట్లయితే ఈ ప్రాంతాలన్నీ చుట్టేయ్యచ్చు. ఇక థాయ్ రెస్టారెంట్లలో రకరకాల వంటకాలను రుచి చూడవచ్చు. 24 గంటలూ ఆహారం అందుబాటులో ఉంటుంది. ఆసియాలోని 50 అత్యుత్తమ బార్‌ల జాబితాలోని నాలుగు బ్యాంకాక్‌లో ఉన్నాయి. సింగిల్‌గా లేదా ఫ్రెండ్స్‌తో టూర్ వేయాలంటే.. బ్యాంకాక్ బెస్ట్ ఆప్షన్.
చియాంగ్ మాయి:
చియాంగ్ మాయి ప్రాంతంలో 300 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. దోయి సుతేప్ కొన్ని తెగల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సింహ బుద్ధుని నివాసమైన వాట్ ఫ్రా సింగ్ సందర్శకులను కట్టి పడేస్తుంది. సూర్యుడి కాంతిలో మెరిసే ఇక్కడి బంగారు స్థూపాలు పర్యాటకులను అబ్బురపరుస్తుంది. దేవాలయాలు మాత్రమే కాదు.. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. చియాంగ్ మాయిలో ఇంకా అందమైన పర్వతాలు, గుహలు, జలపాతాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవన్నీ చూడాలంటే కనీసం మూడు రోజులు పట్టవచ్చు. ఫిబ్రవరి చివరి నుంచి ఏప్రిల్ ప్రారంభం వరకు, చియాంగ్ మాయిలో రైతులు పంటలు వేయడానికి ముందు మంటలు వేస్తారు. కాబట్టి, ఆ టైమ్ అంత మంచిది కాదు. జనవరి నెలలో మాత్రమే అక్కడికి వెళ్లాలి.
ఫుకెట్:
ఇది థాయిలాండ్‌లో అతిపెద్ద ద్వీపం. ఫుకెట్ దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుంది. హొక్కియన్ చైనీస్, థాయ్ మలేషియా మూడు దేశాల సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. హనీమూన్ వెళ్లాలనుకునే జంటలకు ఫుకెట్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
ది ఫార్ నార్త్:
దీనిని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. థాయిలాండ్ కు ఉత్తర శిఖరం. థాయిలాండ్, లావోస్, మయన్మార్ కలిసే ప్రదేశం ఇది. మోటార్‌సైకిల్, మౌంటెన్ బైక్ లేదా కేవలం నడక ద్వారా కూడా ఈ ప్రాంతానికి వెళ్లవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం మనసును కట్టిపడేస్తుంది.
ది అప్పర్ గల్ఫ్:
బ్యాంకాక్‌కు దక్షిణంగా ఉన్న ఈ ప్రాంతానికి రాజధాని నుంచి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ మీరు థాయ్‌లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ నీటిపై తేలియాడే మార్కెట్‌లను చూడవచ్చు. అంతేకాదు.. ప్రసిద్ధ మేక్‌లాంగ్ రైల్వే మార్కెట్‌ను కూడా ఇక్కడే ఉంది. రైలు పట్టాలపైనే ఇక్కడ మార్కెట్ ఉంటుంది. రైలు వచ్చే ముందు వ్యాపారాలు తమ ఉత్పత్తులను పట్టాలపై నుంచి తొలగిస్తారు. ఈ వీడియోలను మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు.
ఖావో యాయ్ నేషనల్ పార్క్:
ఖావో యాయ్ నేషనల్ పార్క్ థాయిలాండ్ లో మూడవ అతిపెద్ద పార్కు. బ్యాంకాక్ నుంచి 2.5 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్లాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్. కోతులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులతో సహా అనేక వన్యప్రాణులను ఇక్కడ చూడవచ్చు.
కో స్యామ్యూయ్:
కో స్యామ్యూయ్‌లోని బీచ్‌లు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఆంగ్ థాంగ్ నేషనల్ పార్క్ , నా మువాంగ్ జలపాతాలు, సిల్వర్ బీచ్‌లు ఇక్కడ చూడదగిన ప్రాంతాలు.
Also Read : ఈ దోశ బరువును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రెసిపీ ఇదే