Independence Day 2025 : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ఇండియాలో స్వతంత్య్ర పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన చారిత్రక ప్రదేశాలివే
Historical Monuments in India : స్వాతంత్య్ర దినోత్సవం 2025 రోజు.. స్వతంత్ర పోరాటం సమయంలో కీలక పాత్ర పోషించిన 6 చారిత్రక ప్రదేశాలను విజిట్ చేయండి. వాటి స్పెషాలటీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Independence Day 2025 Special Historical Monuments : స్వాతంత్య్ర దినోత్సవం 2025 సందర్భంగా.. భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటానికి కేంద్ర బిందువులుగా మారిన ఆరు చారిత్రక ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా? అయితే మీరు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి కేవలం మీరు ట్రిప్‌కి వెళ్లగలిగే ప్రదేశాలు మాత్రమే కాదు.. దేశభక్తిని చాటి చెప్పే ఎన్నో గుర్తులు, స్మారక చిహ్నాలతో కూడిన ప్లేస్‌లు ఇవి. అక్కడి ప్రతి ఇటుక, గోడ, ప్రతి వస్తువు స్వాతంత్య్రం కోసం మన పూర్వీకులు చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేస్తాయి. అందుకే అవి నేటికి జాతీయవాద జ్వాలను వెలిగిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో.. వాటి విశిష్టతలు ఏంటో ఫోటోలతో సహా చూసేద్దాం.
సెల్యులార్ జైలు
(Image Source: Twitter/@incredibleindia)
అండమాన్, నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు. దీనిని కాలా పానీ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత భయంకరమైన వలస జైలు. ఇక్కడ చాలామంది స్వాతంత్య్ర సమరయోధులు ఎన్నో చిత్రహింసలకు గురయ్యారు. దీనిని 1906లో బ్రిటిష్ వారు నిర్మించారు. ఈ జైలు అండమాన్, నికోబార్ దీవులలోని ఒక మారుమూల ప్రదేశంలో ఉంది. బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్, యోగేంద్ర శుక్లా వంటి నాయకులను ఇక్కడ ఖైదు చేశారు. నేడు ఈ జైలు ఒక జాతీయ స్మారకంగా నిలిచింది. చివరి శ్వాస వరకు పోరాడిన వారి కథలను అందిస్తుంది. సందర్శకులకు ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షోను చూపిస్తారు. ఇది ప్రతి భారతీయుడికి భావోద్వేగ యాత్రగా మారుతుంది.
జలియన్ వాలాబాగ్
జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్ 13వ తేదీన భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయానికి వేదికగా మారింది. జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సైనికులు ఎటువంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపినప్పుడు వేలాది మంది నిరాయుధ పురుషులు, మహిళలు, పిల్లలు ప్రాణాలు విడిచారు. ఈ ఊచకోత భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక మలుపుగా మారింది. అందుకే ఇక్కడ బుల్లెట్ గుర్తులు, అమరుల బావి విషాదానికి చిహ్నంగా భద్రపరిచారు. కాంప్లెక్స్ లోపల ఒక స్మారక చిహ్నం, మ్యూజియం ఉంది. ఇది ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతుంది. అమృతసర్‌లోని జలియన్ వాలాబాగ్‌ను సందర్శించి నివాళులు అర్పించడం మన బాధ్యత.
సబర్మతి ఆశ్రమం
అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ 1917లో స్థాపించారు. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ అహింసాత్మక ప్రతిఘటనకు కేంద్రంగా ఉండేది. ఇక్కడి నుంచే గాంధీ 1930లో చారిత్రాత్మకమైన దండి మార్చ్‌ను ప్రారంభించారు. ఉప్పు పన్నును సవాలు చేశారు. ఈ ఆశ్రమంలో గాంధీజీ వ్యక్తిగత వస్తువులు, అరుదైన ఛాయాచిత్రాలు, సత్యం, అహింస, తత్వశాస్త్రం గురించి చెప్పే లేఖలు ఉంటాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేయడం బెస్ట్ థింగ్‌గా చెప్పవచ్చు.
ఎర్రకోట
ఎర్రకోట మొఘల్ నిర్మాణ అద్భుత కట్టడం మాత్రమే కాదు. ఢిల్లీలోని ఈ కోట భారతదేశ స్వాతంత్య్రానికి చిహ్నం. 1947 ఆగస్టు 15వ తేదీన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడ భారతీయ జెండాను ఎగురవేశారు. ఇది బ్రిటిష్ పాలనకు ముగింపు పలికింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం.. ప్రధాన మంత్రి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఇక్కడి నుంచే అందిస్తారు. 17వ శతాబ్దంలో షాజహాన్ నిర్మించిన ఈ కోట 1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర యుద్ధంలో కీలక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. కోట గోడలు భారతదేశ పోరాటం, విజయాన్ని చూశాయి.
కాకోరి రైల్వే స్టేషన్
ఉత్తరప్రదేశ్‌లో 1925 నాటి కాకోరి కుట్ర రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులు.. కాకోరి సమీపంలో ఒక రైలును ఆపి.. ప్రభుత్వ ఖజానా నిధులను దోచుకున్నారు. ఈ సంఘటన యువకుల ధైర్యం, త్యాగానికి చిహ్నంగా మారింది. చాలా మంది విప్లవకారులు ఉరి లేదా జీవిత ఖైదును ఎదుర్కొన్నప్పటికీ.. వారి ధైర్యం తరతరాలను ప్రేరేపిస్తూనే ఉంది. నేడు కాకోరి రైల్వే స్టేషన్ విప్లవ స్ఫూర్తికి చిహ్నంగా మారింది.
విక్టోరియా మెమోరియల్
కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్.. క్వీన్ విక్టోరియాకు స్మారకంగా నిర్మించినప్పటికీ.. బెంగాల్‌లో జరిగిన లెక్కలేనన్ని జాతీయవాద సమావేశాలు, ఉద్యమాలకు సాక్ష్యంగా నిలిచింది. విశాలమైన, విస్తారమైన తోటలు, పాలరాయి నిర్మాణం.. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రసంగాలు, నిరసనలు, సమావేశాలకు అడ్డాగా మారింది. లోపల ఉన్న మ్యూజియం ఇప్పుడు భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని చూపించే అరుదైన కళాఖండాలు, పెయింటింగ్‌లు, డాక్యుమెంట్లతో నిండిపోయింది. విక్టోరియా మెమోరియల్‌ను సందర్శించడం దేశాన్ని తీర్చిదిద్దడంలో బెంగాల్ పోషించిన కీలక పాత్రను ఇది గుర్తు చేస్తుంది.
మరి మీరు కూడా ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి ఇండియాలో ప్రసిద్ధి గాంఛిన ఈ చారిత్రక కట్టడాలను చుట్టేయండి.






















