(Source: Poll of Polls)
Walking Techniques : బీపీని, బరువును కంట్రోల్ చేసే సిద్ధా, హీలింగ్ వాక్ టెక్నిక్స్.. స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట
Yoga Walk :సిద్ద వాక్, హీలింగ్ వాక్ ద్వారా రక్త ప్రసరణను ఎలా మెరుగుపరచవచ్చు? వీటితో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Powefull Yogic Walking Techniques: శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే చాలావరకు ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా రక్తపోటు కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందట. అయితే రక్తప్రసరణ తగ్గితే.. శరీరంలో కొన్ని విధులకు ఆటంకం కలిగి.. అంతర్గత సమస్యలు, వ్యాధులు పెరుగుతాయి. ఫలితంగా అలసట, ఒత్తిడితో పాటు పరిస్థితి విషమించినప్పుడు స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి.
కొన్ని యోగ పద్ధతులు గుండె ఆరోగ్యాన్ని, రక్త ప్రవాహాన్ని సమన్వయం చేయడానికి, నాడీ వ్యవస్థను నార్మల్ చేయడానికి సహాయపడతాయి. వాటిలో సిద్ధా వాక్, హీలింగ్ వాక్ ఉన్నాయి. శ్వాసపై ధ్యాస ఉంచడం, క్రమశిక్షణ, శరీర కదలికలు ఈ సమస్యను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచగలుగుతాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందించి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. శ్వాస, లయ, ఆలోచనను మిళితం చేస్తాయని యోగానిపుణులు హిమాలయన్ సిద్ధా అక్షర్ తెలిపారు.
యోగా ప్రసరణ శాస్త్రం
సాంప్రదాయ యోగ ప్రకారం.. ప్రతి హృదయ స్పందన నాడీలుగా పిలువబడే సూక్ష్మ మార్గాల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ ప్రవాహం ద్వారా ఆక్సిజన్ సమర్థవంతమైన పద్ధతిలో అన్ని కణాలకు వెళ్లి.. మనస్సును రిలాక్స్ చేస్తుంది. గుండె సాధారణ పద్ధతిలో కొట్టుకుంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఇబ్బంది కలిగినప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే దీనిని దూరం చేసి.. శరీరాన్ని, గుండెను ప్రశాంతంగా ఉంచే టిప్స్ చూసేద్దాం.
సిద్ధా వాక్
సిద్ధా నడక అంటే "8" వ్యాసార్థంలో నడక రూపంలో ఉన్న ధ్యానానికి మరొక రూపం. దీనిని చేయడం వల్ల మెదడులోని రెండు వైపులా అనుసంధానం అవుతుంది. శరీరం, మనస్సును ఏకం అవుతుంది. శక్తివంతమైన, లయబద్ధమైన శ్వాస తీసుకుంటాము. ఈ మృదువైన కదలికలు.. శ్వాస రక్త నాళాలను సడలించడానికి సహాయపడతాయి. రక్తపోటు తగ్గుతుంది.
ఎలా చేయాలంటే
- నేలపై "8" ఆకారాన్ని గీయండి.
- నెమ్మదిగా భుజాలను వదులు చేసుకుని ఉత్తరం నుంచి దక్షిణానికి (11 నిమిషాలు) నడవాలి.
- అనంతరం వెనుకకు నడవాలి. అంటే దక్షిణం నుంచి ఉత్తరం వరకు మరో 11 నిమిషాలు.
- దీనిని ఒక్కో వైపు 21 నిమిషాలకు (మొత్తం 42 నిమిషాలు) పెంచుకోవచ్చు.
ఈ వాకింగ్ టెక్నిక్ రక్తపోటును నియంత్రించడంలో, గుండె కొట్టుకోవడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచి, మనస్సును శాంతపరచడంలో హెల్ప్ చేస్తుంది.
హీలింగ్ వాక్
హీలింగ్ వాక్ అనేది ఏ వయస్సు వారికైనా మంచిదే. ఇది గుండె, ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఓర్పు, శక్తి స్థాయిలను పెంచుతుంది.
ఎలా చేయాలంటే..
- భుజాల స్థాయిలో చేతులు, నేలకు సమాంతరంగా నిటారుగా ఉండేలా నిలబడాలి.
- క్రమంగా ఈ భంగిమను కొనసాగిస్తూ నడవడం ప్రారంభించండి.
- ఒక రౌండ్‌కు 30 సెకన్లతో.. ఐదు రౌండ్‌లు చేయాలి.
- ప్రతి రౌండ్‌ను 1-2 నిమిషాలతో ప్రారంభించి.. కాలక్రమేణా 5 నిమిషాలకు పెంచుకోవచ్చు.
ఈ కదలిక ఛాతీని విస్తరించేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మెదడు, శరీర సమన్వయాన్ని పెంచుతుంది. ఇది భుజాలు, మెడ ప్రాంతంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక మెరుగవుతుంది. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌గా ఉండగలుగుతారు.
వీటితోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, ధ్యానం, ప్రశాంతమైన దినచర్యను కూడా ఫాలో అయితే రక్తపోటు అదుపులోకి వస్తుంది. స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. వ్యాయామం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.






















