Kidney Transplant Facts : కిడ్నీ మార్పిడి ఎప్పుడు చేస్తారు? ఆపరేషన్ తర్వాత పాత మూత్రపిండాలను ఏమి చేస్తారో తెలుసా?
Kidney Surgery : మూత్రపిండాల సమస్యలు ఎక్కువైనప్పుడు రోగి ఆరోగ్యం కోసం వాటిని మార్చేస్తారు. అయితే తీసేసిన కిడ్నీలు ఏమి చేస్తారో తెలుసా? వింటే కచ్చితంగా షాక్ అవుతారు.

Interesting Facts about Kidney Transplant : కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. అయితే వీటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు అయితే వైద్యులు సూచించే మందులు, జీవనశైలి మార్పులతో వాటిని దూరం చేసుకోవచ్చు. కానీ.. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలను మార్చుకోవాల్సి వస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కిడ్నీల మార్పిడి చేస్తారు. ఈ చర్య రోగి ప్రాణాలు కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. అసలు ఎలాంటి సందర్భాల్లో మూత్రపిండాలు మార్పిడి చేస్తారు? ఆ సమయంలో తీసేసిన కిడ్నీలు ఏమి చేస్తారు? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రపిండాల మార్పిడి
సాధారణంగా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు.. డయాలసిస్ ద్వారా కూడా శరీరం రికవరీ పొందనప్పుడు.. వైద్యులు మూత్రపిండ మార్పిడిని సిఫార్సు చేస్తారు. అటువంటి పరిస్థితిలో కొత్త మూత్రపిండం శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ రోగి శరీరంలోని పాడైన, చెడిపోయిన కిడ్నీ ఏమవుతుంది?
పాత మూత్రపిండాన్ని ఏమి చేస్తారు?
న్యులాంగోన్ నివేదిక ప్రకారం.. చాలా సందర్భాల్లో వైద్యులు పాత మూత్రపిండాలను శరీరంలోనే ఉంచేస్తారట. వాస్తవానికి చెడిపోయిన మూత్రపిండం సరిగ్గా పనిచేయదు. కానీ శరీరానికి హాని కలిగించదట. అటువంటి పరిస్థితిలో శస్త్రచికిత్స సమయంలో దానిని తొలగించాల్సిన అవసరం ఉండదట. వైద్య భాషలో దీనిని "నాన్-ఫంక్షనల్ కిడ్నీ" అంటారు. ఇది శరీరంలో ఎటువంటి సమస్య లేకుండా ఉండగలదు. అలాగే లోపల కాలక్రమేణా కుంచించుకుపోతుందట.
కిడ్నీల మార్పిడి అంటే పాత మూత్రపిండాలను తీసివేసి.. కొత్త మూత్రపిండాలను అదే స్థానంలో ఉంచుతారని తరచుగా అనుకుంటారు. అయితే వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంటుంది. వైద్యులు కొత్త మూత్రపిండాలను పొత్తికడుపు దిగువ భాగంలో.. అంటే కడుపు కింద భాగంలో ఉంచుతారు. ఇక్కడ రక్త సరఫరా, మూత్రాశయంతో ఈజీగా కనెక్షన్ చేయగలుగుతారు. అంటే చాలా మంది రోగుల శరీరంలో మార్పిడి తర్వాత మూడు మూత్రపిండాలు ఉంటాయి. రెండు పాతవి, ఒకటి కొత్తది.
పాత మూత్రపిండం ఉన్నప్పటికీ.. కొత్త మూత్రపిండం మొత్తం పనిని చూసుకుంటుంది. అంటే రక్తాన్ని ఫిల్టర్ చేయడం, మూత్రాన్ని తయారు చేయడం, శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించడం వంటి పనులు చేస్తుంది. పాత మూత్రపిండం దాని స్థానంలో ఉన్నప్పటికీ.. అది ఎటువంటి పాత్రను పోషించదు.
మూత్రపిండాలను ఎప్పుడు తొలగిస్తారు?
అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మూత్రపిండాలను తొలగిస్తారట. అది ఎప్పుడంటే పాత మూత్రపిండంలో నిరంతరం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. అలాగే మూత్రపిండం చాలా పెద్దదిగా మారి.. పొత్తికడుపులో వాపు లేదా నొప్పిని కలిగించినప్పుడు.. మూత్రపిండంలో క్యాన్సర్ వంటి ఏదైనా వ్యాధి గుర్తించినప్పుడు వాటిని తొలగిస్తారు. అటువంటి సందర్భాలలో వైద్యులు కిడ్నీ మార్పిడికి ముందు లేదా దానితో పాటు పాత మూత్రపిండాలను తొలగిస్తారు.






















