Fingers Swelling : చలి మొదలుకాగానే కాళ్లు, చేతి వేళ్లు వాచిపోతున్నాయా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Winter Health : చలి పెరిగినప్పుడు రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఆ సమయంలో శరీరంలో వివిధ మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా చేతి వేళ్లు ఎరుపు, నీలం రంగులోకి మారతాయి. దాని అర్థం ఏంటి?

Fingers Swelling During Winter : చలికాలం మొదలైపోయింది. వాతావరణంలో మార్పులు ఉన్నా సరే.. సాయంత్రం త్వరగా చీకటిపడిపోతుంది. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చల్లని గాలులు పెరిగాయి. వాతావరణంలో కనిపిస్తోన్న ఈ చలి ప్రభావం.. శరీరంపై కూడా పలు మార్పులు చూపిస్తుంది. చలి మొదలు కాగానే ఇమ్యూనిటీ దెబ్బతినడం నుంచి.. వివిధ రకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటివాటిలో చాలా మంది ఎదుర్కొనే సమస్య చేతులు, కాళ్లు ముడుచుకుపోవడం ఒకటి. ఆ సమయంలో వేళ్లలో వాపు, దురద వంటి సమస్యలు పెరుగుతాయి.
నిపుణులు ప్రకారం చలి ప్రభావం శరీరంలో రక్త ప్రసరణపై పడుతుంది. దీని కారణంగా ఈ సమస్య ఎక్కువమందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చలి మొదలు కాగానే చేతులు, కాళ్ల వేళ్లు ఉబ్బడం వంటివి కనిపిస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిపుణులు ఇస్తోన్న సూచనలు ఏంటో చూసేద్దాం.
వేళ్లు ఎందుకు ఉబ్బుతాయి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలి పెరిగేకొద్దీ శరీరంలోని సిరలు కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చేతులు, కాళ్ల వేళ్లు ఎర్రగా, నీలంగా మారతాయి. వాస్తవానికి చల్లని ఉష్ణోగ్రతలలో ఎక్కువసేపు ఉండటం వల్ల వేళ్లలో వాపు, దురద వస్తాయి. ఈ వాపు నెమ్మదిగా పెరిగి నొప్పిగా మారుతుంది. దీనివల్ల రోజువారీ పనులలో కూడా ఇబ్బంది కలుగుతుంది.
మహిళల్లోనే ఎందుకు ఎక్కువ?
పురుషులతో పోలిస్తే మహిళల్లో చలికాలంలో వేళ్లు ఉబ్బే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే మహిళలు రోజంతా వంటగది, నీటికి సంబంధించిన పనులలో ఉంటారు. చల్లటి నీరు నిరంతరం తాకడం వల్ల చేతుల చర్మం ముడుచుకుపోతుంది. రక్త ప్రవాహం ప్రభావితమవుతుంది. దీనివల్ల వాపు, దురద పెరుగుతాయి.
వేళ్లలో వాపు వస్తే ఏమి చేయాలి?
చలికాలంలో వేళ్లలో వాపు వస్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేళ్ల వాపును తగ్గించడానికి చేతులు, కాళ్లను వెచ్చని దుస్తులతో కవర్ చేయాలి. అలా అని హీటర్ లేదా మంట దగ్గర చేతులను వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. నెమ్మదిగా శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. అప్పుడు సమస్య దానంతట అదే తగ్గుతుంది. అలా అని చేతులు, కాళ్ల వాపును తేలికగా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రారంభంలో చిన్నదిగా అనిపించవచ్చు.. కానీ నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యగా మారవచ్చు. చాలా సందర్భాల్లో ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ చేతులు, కాళ్లల్లో వాపు పెరిగినా లేదా నొప్పి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.






















