Liver Detox Tips : కాలేయాన్ని సహజంగా శుభ్రపరిచే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే లివర్ క్యాన్సర్ ప్రమాదం ఎప్పటికీ రాదట
Natural Liver Detox : నేటి జీవనశైలి కాలేయంపై వివిధ రకాలుగా చెడు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల వివిధ కాలేయం సమస్యలు పెరుగుతున్నాయి. అయితే కాలేయాన్ని కాపాడగలిగే ఇంటి చిట్కాలు చూసేద్దాం.

Fatty Liver Home Remedies : కాలేయం మన శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని బాడీలో సూపర్ క్లీనర్ అంటారు. అంతేకాకుండా ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. కానీ నేటి బిజీ లైఫ్‌లో చేసే మిస్టేక్స్ వల్ల కాలేయ సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, మద్యం వంటి కారణాల వల్ల కాలేయంపై చెడు ప్రభావం పడుతుంది. ఇది నెమ్మదిగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దీనిని ఫ్యాటీ లివర్ అంటారు. సమయానికి శ్రద్ధ తీసుకోకపోతే ఈ సమస్య కాలేయ సిరోసిస్ లేదా కాలేయ క్యాన్సర్‌గా మారుతుంది.
ఇప్పటికీ ఆలస్యం కాలేదు. మీరు మీ కాలేయాన్ని రక్షించుకోవాలనుకుంటే.. సహజంగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. ఎలాంటి ఖరీదైన చికిత్స లేకుండా కాలేయాన్ని డీటాక్స్ చేయగలిగే ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి మీకు మరింత సులభంగా కాలేయాన్ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి లివర్ని శుభ్రపరిచి, బలోపేతం చేసే కొన్ని సురక్షితమైన, ప్రభావవంతమైన దేశీయ చిట్కాలు ఏంటో చూసేద్దాం.
నిమ్మరసం..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయను రసం పిండి కలిపి తాగే అలవాటు చేసుకోండి. నిమ్మకాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది. ముఖంలో మెరుపువస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. కాలేయానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కాటెచిన్స్ అనే మూలకం కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. డీటాక్స్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రోజుకు 1 నుంచి 2 కప్పుల షుగర్ లేని గ్రీన్ టీ తాగండి. ఇది శరీరాన్ని తేలికగా అనిపించేలా చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
పసుపు
పసుపు మన ఇంట్లో ఉండే ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఉండే కర్కుమిన్ కాలేయపు వాపును తగ్గిస్తుంది. దాని కణాలను రిపేర్ చేస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో అర టీస్పూన్ పసుపు వేయండి. లేదా రాత్రిపూట గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగండి. ఇది కాలేయాన్ని డీటాక్స్ చేస్తుంది. కాలేయ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
తృణధాన్యాలు
మైదా లేదా తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా తినండి. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కాలేయంపై ఎక్కువ పని భారం పడకుండా చూస్తుంది. క్రమం తప్పకుండా తృణధాన్యాలు తినడం వల్ల కాలేయం పనితీరు పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బాదం, వాల్నట్, సీడ్స్
నట్స్ అంటే బాదం, వాల్నట్, అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి కాలేయ కణాలను రక్షిస్తాయి. వాపును తగ్గిస్తాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి. రోజుకు 4 నుంచి 5 బాదం లేదా కొన్ని వాల్నట్స్ తినడం మంచి ఎంపిక.
యాపిల్స్, బెర్రీలు
యాపిల్స్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి పండ్లు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. దానిని శుభ్రపరుస్తాయి. అల్పాహారంలో లేదా సాయంత్రం స్నాక్స్‌గా వీటిని తీసుకుంటే మంచిది.
ఇప్పటివరకు లివర్ని డీటాక్స్ చేసే ఫుడ్స్‌ని చూశాము. కానీ మీకు తెలుసా.. ఎలాంటి ఖర్చు లేకుండా లివర్ సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది కాలేయానికి హాని చేస్తుంది. కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం, యోగా లేదా డీప్ బ్రీతింగ్ చేయండి. అలాగే వ్యాయామం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉండడం మరచిపోకుండా. కాలేయ సమస్యలు రాకముందే దూరం చేసుకుంటే మంచిది. ఒకవేళ సమస్య ఉందని గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకుంటే డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది.






















