Relationships: నా భార్య కన్నా ఆమె నాకు ఎక్కువ నచ్చుతోంది, ఏం చేయాలి?
తన భార్య కన్నా, ఆమె అక్క ఎక్కువ నచ్చుతోందని, ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్న యువకుడి కథ ఇది.
ప్రశ్న: మాకు పెళ్లయి మూడేళ్లు అవుతోంది. పెద్దల ద్వారానే మా పెళ్లి జరిగింది. నా భార్యకు ఒక అక్క ఉంది. ఆమెకు మా కన్నా ముందే పెళ్లయిపోయింది. కానీ ఎందుకో తెలియదు. ఆమె నాకు చాలా బాగా నచ్చింది. నా భార్య కన్నా ఆమెనే నన్ను ఎక్కువ ఆకర్షిస్తోంది. అది తప్పని తెలిసినా, ఆమెను చూస్తూ ఉండాలనిపిస్తోంది. ఆమె నా భార్య కన్నా అందంగా ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. అలాగని నా భార్య అంటే నాకు ఇష్టంలేదని చెప్పడం లేదు. భార్యను కూడా ప్రేమిస్తున్నా. కానీ నా భార్య అక్క ఆలోచనలు రాకుండా నేను ఆపలేకపోతున్నాను. ఆమెలోనే నాకు ఎక్కువ సుగుణాలు కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతుంటే వినాలనిపిస్తోంది. ఆమె నన్ను కేవలం చెల్లెలి భర్తగానే చూస్తోంది. నాపైన ఆమెకు ఎలాంటి ఆసక్తి లేదు. మర్యాదగా కూడా ఉంటుంది. అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఆమె ఆలోచనల నుంచి బయటపడాలనుకుంటున్నాను. సంబంధ బాంధవ్యాలు నాశనం కాకుండా కాపాడుకోవాలనుకుంటున్నాను. ఏం చేయమంటారో చెప్పండి.
జవాబు: మీరు చేస్తున్నది తప్పు అన్న సంగతి మీరే గ్రహించారు. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు అని మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం జీవితంలో నమ్మకం, నిబద్ధత చాలా అవసరం. నిబద్ధత చెదిరి మీరు మరొకరి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఇది భార్యకు తెలిస్తే మీ కుటుంబం జీవితం ఎంతగా నాశనం అవుతుందో ఊహించండి. మీ తల్లిదండ్రులు, అన్నదమ్ముల ముందు తలెత్తుకోలేరు. ఇది సంఘంలోని మీ మర్యాదను దెబ్బతీస్తుంది. అందంగా ఉన్న ప్రతి ఒకరికి ఆకర్షితులయ్యేంత బలహీనమైనదా మీ మనస్తత్వం? అలాంటి మనస్తత్వం ఉంటే చాలా ప్రమాదకరం. అందంగా ఉన్నా లేకపోయినా పెళ్లయ్యాక భార్యనే రతీదేవిగా ఊహించుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి. కేవలం అందంగా ఉండడం, కాన్ఫిడెంట్ గా మాట్లాడడమే మీకు నచ్చుతున్నాయా? మీ భార్య మీకోసం చేసే పనులేవీ ఆకర్షణీయంగా కనిపించడం లేదా? ఒక్కసారి ఆలోచించండి.
మీ భార్యలో కూడా ఎన్నో సుగుణాలు ఉంటాయి. వాటిని కూడా తలచుకోవడం మొదలుపెట్టండి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అలా మీ భార్యలో ఉన్న టాలెంట్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆమెతో మీ అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. వదిన తల్లితో సమానమని అంటారు. అంటే మీ భార్య అక్క మీకు తల్లితో సమానం. మీ తల్లిని ఎలా చూస్తారో... ఆమెను అలాగే చూడండి. మనసులోకి చెడు భావనలు వచ్చే అవకాశం తగ్గుతుంది. మీ వదిన తన భర్తా,పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నట్టు మీరు కూడా కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకోండి, అంతే తప్ప ఆమె అందాన్ని, మాటతీరును చూసి మోహించకండి. ఇంత బలహీన మనస్తత్వం మీ భవిష్యత్తుకు ప్రమాదకరం.
Also read: బాలింతల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వారు పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడినట్టే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.