Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?
చంద్రునిపై చేరాలని మనిషి ఎప్పట్నించో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కాస్త ముందుడుగు పడింది.
మనిషి చంద్రుడిని వశం చేసుకుని దాన్ని నివాసస్థలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఎన్నో ప్రయోగాలు సాగుతున్నాయి. అలాగే చందమామపై పంటలు పండించగలమా అనే కోణంలోనూ ఎప్పట్నించో పలు ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో ముందుడుగు వేశారు శాస్త్రవేత్తలు. చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలను కొన్ని రోజుల పాటూ పెంచారు. ఇది పూర్తిగా విజయవంతం కాకపోయినా ఆ దిశగా మొదటి అడుగు విజయవంతంగా పడినట్టే. చంద్రుని నుంచి తెచ్చిన మట్టిలో ఆకుకూరల విత్తనాలు వేసి ఉంచారు. రెండు రోజుల్లో ఆ విత్తనాల నుంచి మొలకలు వచ్చాయి. ఆరు రోజుల వరకు అవి సాధారణ మొక్కల్లాగే పెరిగాయి. ఆ తరువాత మాత్రం పెరుగుదలలో లోపం కనిపించింది. ఎత్తు ఎదగకుండా పొట్టిగానే ఉండిపోయాయి. ఈ మొక్కలు ఒత్తిడికి గురైనట్టు భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. వాటిపై లోతైన అధ్యయనం సాగుతోంది.
మట్టి ఎక్కడిది?
నాసా 1969 నుంచి చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపింది. తిరిగి వచ్చేటప్పుడు మట్టిని తీసుకుని రమ్మని వ్యోమగాములను ఆదేశించింది. అలా మూడేళ్ల కాలంలో వ్యోమగాములు 382 కిలోల మట్టి తెచ్చారు. ఆ మట్టిని అప్పట్నించి నాసా అలాగే దాచి పెట్టింది. కొన్ని నెలల క్రితం మొక్కల ప్రయోగం ఒక మొక్కకు కిలో చొప్పున అందించింది. ఆ మట్టిలోనే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు విత్తనాలను మొలిపించారు. ఇంకా ఈ పరిశోధనా కొనసాగుతోంది. భూమిపై ఉన్న వాతావరణాన్ని తట్టుకుని ఆ మొక్కలు బతుకుతాయో లేవో చూస్తున్నారు.
చంద్రుడి మీద పంటలు పండే అవకాశం ఉంటే ఇతర పరిశోధనలు చాలా సులభతరం అవుతాయని భావిస్తోంది నాసా. అంతరిక్ష యాత్రికులకు, వ్యోమగాములకు భూమి నుంచి ఆహారం పంపాల్సిన అవసరం లేకుండా, అక్కడే పండించుకుని తినే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా చైనా చంద్రుని మీదకు పత్తి విత్తనాలు పంపింది. అవి కూడా మొలకెత్తినట్టు అప్పట్లోనే ప్రకటించింది చైనా నేషనల్ స్పేష్ అడ్మినిస్ట్రేషన్. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలును పెంచి చూశారు. అప్పుడు విత్తనాలు మొలకెత్తాయి. దీన్ని భూ వాతావరణంలోనే కాదు చంద్రుడు, అంతరిక్షంలో కూడా మొలకెత్తడం శాస్త్రావేత్తలో ఉత్సాహాన్ని నింపుతోంది.
Also read: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం