Sleep: సరిగా నిద్రపోవడం లేదా? మీ గుండె ప్రమాదంలో పడినట్లే
సరిగా నిద్రపోకుండా ఫోనుల్లోనే కాలం గడిపేస్తూ ఉంటున్నారా? అయితే మీరు చాలా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఫోన్లు వచ్చిన తర్వాత సమయమంతా దానికే కేటాయిస్తూ నిద్ర గురించే మర్చిపోతున్నారు. రాత్రి వేళ కూడా చూసుకుంటూ ఎప్పటికో నిద్రపోతూ సమయానికి నిద్రలేవకుండా ఉంటున్నారు చాలామంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా 7-8 గంటలనిద్ర అవసరం. అప్పుడే శరీర పనితీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా హాయిగా ఉంటుంది. నిద్రలేమి వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. 50 ఏళ్ల పైబడిన సుమారు 7 వేల మందిను ఒక దశాబ్దం పాటు శాస్త్రవేత్తలు పరిశీలించారు. రాత్రి పూట తగినంతగా నిద్రపోవడం వల్ల వారిలో వచ్చిన మార్పులని కొన్నేళ్ళ పాటు గమనించారు. వాళ్ళిచ్చిన అధ్యయనం ప్రకారం బాగా నిద్రపోనీ వారితో పోలిస్తే చక్కగా నిద్రపోయిన వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం 75 శాతం పడిపోయినట్లు గుర్తించారు.
గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్స్ వల్ల ఏటా సుమారు లక్ష మంది బ్రిటిషర్లు ప్రాణాలు కోల్పోతున్నట్టు ఓ నివేదిక చెబుతోంది. మెరుగైన నిద్ర వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారీ నుంచి రక్షిస్తుందని సదరు నివేదిక పేర్కొంది. ఫ్రెంచ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన ఒక డాక్టర్ మాట్లాడుతూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిద్రను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, దాని వల్ల గుండె సంబంధిత జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అన్నారు. ప్రపంచంలో చాలా మంది మరణాలకి కార్డియోవాస్క్యులర్ ప్రధాన కారణం. అందుకే ఆరోగ్యకరమైన గుండె కావాలంటే మంచిగా నిద్ర పోవాలని ఆయన సూచిస్తున్నారు.
నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరగడం, రక్తపోటు స్థాయిల్లో పెరుగుదల నమోదవుతుందని అన్నారు. పగటి నిద్రతో పోలిస్తే రాత్రి నిద్రే శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. రాత్రి సరిగా పడుకోలేదు కదా పొద్దునే పడుకుంటే సరిపోతుందని అనుకుంటే మన ఆరోగ్యాన్ని మనంఏ ప్రమాదంలోకి నెట్టేసుకున్నట్టు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేళకి నిద్రపోకపోవడం వల్ల శరీర జీవగడియారంలో మార్పులు చోటు చేసుకుంటాయి. దాని వల్ల సమయానికి జరగాల్సినవి అన్ని క్రమం తప్పి వ్యవహరిస్తాయి.
అధిక ఒత్తిడి, ఆఫీసుల్లో షిఫ్ట్ టైమింగ్స్ ఇతరాత్ర కారణాల వల్ల నిద్రకి ఆటంకం కలుగుతుంది. ఇలా అవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా మారుతుంది. మంచి నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇది మీ రక్తనాళాలని సదలించి రక్తపోటు నివారణ తగ్గిస్తుంది. నిద్ర లేమి వల్ల ఒత్తిడి పెరిగి హార్మోన్స్ స్థాయిలను నియంత్రించే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. దాని కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
నిద్రలేమి వల్ల మొహం కూడా జీవం లేకుండా కనిపిస్తుంది. నిద్ర లేమి వల్ల ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. యోగా, ధ్యానం, సాత్వికాహారం, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే నిద్రలేమి సమస్య నుంచి త్వరగానే బయట పడే అవకాశం ఉంది.
Also Read: కాపర్ పెప్టైడ్‌లతో అందం మీ సొంతం, రాగిలో ఎన్ని సుగుణాలో చూడండి
Also Read: మీ లంచ్ బాక్స్ లో ఇవి చేర్చుకుంటే బోలెడు పోషకాలు అందినట్టే