Heart Problems: విపరీతమైన వేడి గుండె వైఫల్యానికి దారితీస్తుంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి
విపరీతమైన వేడిని గుండె తట్టుకోలేదు. అనారోగ్యం బారిన పడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మన శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కండరాల పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య ప్రమాదాలను పెంచుతాయి. బయట వాతావరణం వేడెక్కడం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. దీని వల్లే వడదెబ్బ తగులుతుంది. శరీరం అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల వడదెబ్బ బారిన పడతారు. వేడి వాతావరణంలో గుండె వైఫల్యం, గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె లేదా మెదడుకు రక్తప్రవాహంలో అంతరాయాలు కలుగుతాయి. దీనివల్లే స్ట్రోక్, గుండెపోటు వంటివి వచ్చే అవకాశం ఉంది.
పరిశోధనల ప్రకారం గుండె జబ్బులు ఉన్న రోగులు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళకపోవడమే మంచిది. వారు త్వరగా గుండెపోటు బారిన పడే అవకాశం ఉంది. అలాగే మెదడు సమస్యలతో బాధపడేవారు, వయసు మీరిన వారు, చిన్న పిల్లలు ఎండల్లో బయట తిరగకపోవడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత కూడా తెలియకుండానే పెరిగిపోతుంది. ఇది గుండెను ప్రమాదంలో పడేలా చేస్తుంది. విపరీతమైన వేడి హృదయనాళ వ్యవస్థ పై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల గుండె మరింత కష్టంగా పని చేయాల్సి వస్తుంది. వేడి వాతావరణం వల్ల శరీరం తన ఉష్ణోగ్రతను సమస్థాయిలో నిర్వహించడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. వడదెబ్బ కారణంగా మెదడు ఇతర ముఖ్యమైన అవయవాలు ఉబ్బే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి శాశ్వత నష్టం కలగవచ్చు. కాబట్టి అధిక ఉష్ణోగ్రతల సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
శరీర ఉష్ణోగ్రత పెరగడం, మానసిక స్థితి లేదా మానసిక ప్రవర్తన మారడం, వికారంగా అనిపించడం, వాంతులు అవడం, మైకం కమ్మడం, మూర్చ రావడం, కండరాలు తిమ్మిరి పట్టడం, శ్వాస వేగంగా తీసుకోవాల్సి రావడం, చర్మంపై దద్దుర్లు, చెమట అధికంగా పట్టడం, తలనొప్పి రావడం ఇవన్నీ కూడా వడదెబ్బకు సంకేతాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రథమ చికిత్స తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత 104 ఫారెన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటే అది వడదెబ్బ వల్లే అని అర్థం చేసుకోవాలి.
పడదెబ్బ బారిన పడితే కొన్ని పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలి. రక్త పరీక్ష ద్వారా కిడ్నీల పనితీరు, సీరం, ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు ఎలా ఉన్నాయో గమనిస్తారు. అలాగే ధమనుల్లోని వాయువుల స్థాయిలను కూడా తనిఖీ చేస్తారు. మూత్ర పరీక్ష ద్వారా మూత్రం రంగు వంటివి మారాయేమో పరీక్షిస్తారు. ఈ పరీక్షలతో పాటు గుండె ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఈసీజీ, కార్డియోగ్రఫీ వంటివి నిర్వహిస్తారు. మెదడుకు సీటీ స్కాన్, MRI కూడా చేస్తారు. వీటి ద్వారా వడదెబ్బ కారణంగా గుండె, మెదడు ఏ మేరకు ప్రభావితం అయ్యాయో తెలుసుకొని చికిత్స అందిస్తారు.
Also read: World blood donor day: రక్తదానం చేయండి, నిండు ప్రాణాలను కాపాడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.