Egg freezing: మహిళలు సంతానం కోసం అండాలు భద్రపరచుకోవాలని అనుకుంటున్నారా? ఇలా చెయ్యండి
కెరీర్ కోసం ప్లాన్ చేసుకొనే అమ్మాయిలు.. జీవితంలో స్థిరపడిన తర్వాత పిల్లలను కనాలని అనుకుంటారు. వారు తమ అండాలను ఓసైట్ క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరచుకునే అవకాశం ఉంది.
Egg freezing: ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు త్వరగా పెళ్లి చేసుకుని తల్లులు కావడానికి ఆసక్తి చూపడం లేదు. పెళ్లి, పిల్లలను రకరకాల కారణాలతో వాయిదా వేస్తున్నారు. అయితే కొంత వయసు తర్వాత అండోత్పత్తి నాణ్యత తగ్గిపోతుంది. ఆ తర్వాత పిల్లలు కనాలన్నా కష్టమే. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కెరీర్ ఓరియెంటెడ్ యువతులు తమ అండాలను ఓసైట్ క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరచుకునే అవకాశం ఉంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసులో యువతులు తమ అండాలను ఈ పద్ధతిలో భద్రపరుచుకోవచ్చు. తల్లి కావడానికి సిద్ధపడిన సమయంలో వీటిని ఫలదీకరించి గర్భాశయంలో ప్రవేశపెట్టవచ్చు.
ఇలా అండాలు భద్రపరచుకోవాలనుకునే వారు కొన్ని సూచనలు, జాగ్రత్తలు తప్పక పాటించడం అవసరం. అవేమిటో చూడండి.
ఏ వయస్సులో అండాలను భద్రపరుచుకోవాలి?
అండోత్పత్తి నాణ్యత వయసుతో తగ్గుతుంది. 35 సంవత్సరాల తర్వాత ఈ నాణ్యత క్రమంగా తగ్గతూ వస్తుంది. ఆ వయసు వరకు పిల్లలను కనాలని అనుకోని యువతులు తమ అండాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరచుకొవచ్చు. 35 సంవత్సరాల పైబడిన మహిళలు తమ అండాలని భద్రపరచుకునే అవకాశం లేదని కాదు. కానీ అంతకంటే తక్కువ వయసు వారు భద్రపరచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 35 సంవత్సరాల తర్వాత ఉత్పత్తయిన అండాల నుంచి గర్భం దాల్చేందుకు విజయావకాశాలు తక్కువట. ఐవీఎఫ్ ప్రక్రియ విజయవంతం కావడానికి మరిన్ని ఎక్కువ సైకిల్స్ అవసరం పడవచ్చు.
మానసిక సంసిద్ధం కావాలి
తమ అండాలను భద్రపరచుకోవాలనుకునే వారు ముందుగా మానసికంగా సంసిద్ధం కావాలి. వారి మానసిక స్థితి కూడా వారి ప్రత్యుత్పత్తి సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. కనుక ప్రిజర్వేషన్ ప్రక్రియకు ముందుగా మానసికంగా సంసిద్ధం కావడం చాలా ముఖ్యం.
శారీర స్థితి
కీమోథెరపి, ఎండోమెట్రియాసిస్, ఇతర ఆటోఇమ్యూన్ పరిస్థితులు, అనారోగ్యాలు, వాటికి సంబంధించిన చికిత్సలు ప్రత్యుత్పత్తి సామర్థ్యం మీద ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు ముందుగా సంతానసాఫల్య అవకాశాలను కాపాడుకోవడం అవసరమవుతుంది. ఇలాంటి వారు ఎగ్ ప్రీజింగ్ విధానంలో అండాలను దాచుకోవచ్చు. చికిత్స తర్వాత పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు.. గర్భం దాల్చడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
కుటుంబ ఆరోగ్య చరిత్ర
కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా చాలా త్వరగా మెనోపాజ్ దశకు చేరుకోవడం, లేదా ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫేయిల్యూర్ వంటి సమస్యలున్న మహిళలు తమ అండాలను ప్రిజర్వ్ చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- అండాలు భద్రపరిచినంత మాత్రాన తర్వాత కాలంలో వాటి నుంచి తప్పకుండా గర్భం దాల్చుతారన్న గ్యారెంటీ ఉండదు.
- అండాలు ఫ్రీజ్ చేసిన సమయంలో మీ వయసు ఎంత అనేది అన్నింటికంటే ఎక్కువ ప్రభావం చూపే విషయం.
- ఇలా ప్రీజ్ చేసిన అండాలను తిరిగి ద్రవీభవన ప్రక్రియ చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలు వంటివన్నీ కూడా ఫలధీకరణ మీద ప్రభావం చూపుతాయి.
- ఫలధీకరణ జరిగిన తర్వాత ఇంప్లాంటేషన్ సమయంలో గర్భాశయ ఆరోగ్యం కూడా ముఖ్యమే.
- అండాలను భద్రపరచుకోవాలనుకునే మహిళలు ముందుగా వారి అండాల ఆరోగ్యం వారి ఇతర అరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం అవసరం.
- నిజానికి ఓజైట్ క్రయోఫ్రీజింగ్ అనేది మహిళల పాలిట వరంగా చెప్పుకోవచ్చు.