Foul body odours: ఈ శరీర భాగాల నుంచి దుర్వాసన వస్తోందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Foul body odours: శ్వాసలో దుర్వాసన నుంచి, జననాంగం నుంచి వచ్చే ప్రత్యేక దుర్వాసన వరకు అన్ని వాసనలు శరీరంలో జరుగుతున్న మార్పులకు సంకేతాలట.
Foul body odours: శారీరక శ్రమ తర్వాత వచ్చే చెమటతో శరీరంలో ఒక రకమైన చెమట వాసన రావడం సహజం. కానీ అది మామూలు చెమట వాసనైతే పర్వాలేదు. కానీ వాసనలో తేడాను గమనిస్తే మాత్రం అది మరింకేదైనా ప్రమాదకర ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోటి దుర్వాసన
బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి దుర్వాసన వదలటం లేదంటే దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి కారణాలు తెలుసుకోవడం అవసరం. ఎంత శుభ్రం చేసినా నోటి నుంచి దుర్వాసన దూరం కావడం లేదంటే మాత్రం ఆరోగ్యంలో ఏదో తేడా ఉందని అనుమానించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీడని నోటి దుర్వాసనకు ఆసిడ్ రిఫ్లక్స్, క్రానిక్ సైనస్ ఇన్ఫెక్షన్, నోటిలో తగినంత లాలాజలం రాకపోవడం, లేదా కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా కావచ్చు. చాలా అరుదుగా నోటి దుర్వాసన నోటి క్యాన్సర్ వల్ల కూడా కావచ్చని డెంటిస్టులు అంటున్నారు.
జననేంద్రియాల్లో దుర్వాసన
జననేంద్రియాల్లో నుంచి సువాసన రాకపోవచ్చు కానీ చేపల వంటి నీచు వాసన వస్తే మాత్రం అది కొంచెం ఆలోచించాల్సిన విషమే. స్త్రీ జననేంద్రియ స్రావాలు ఇలా నీచు వాసన వేస్తుంటే కచ్చితంగా గైనకాలజిస్టును సంప్రదించాలి. వాసనతో పాటు యోని స్రావాలు నీటిలా పలుచగా, బూడిద రంగుతో ఉండడం బ్యాక్టిరీయల్ వాగినోసిన్ అనే ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. దీనికి తప్పకుండా యాంటీబయాటిక్ చికిత్స అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలో దురద కానీ, మంట కానీ ఉండవట.
మూత్రంలో దుర్వాసన
మూత్రం కచ్చితంగా ప్రత్యేకమైన దుర్వాసన కలిగి ఉంటుంది. కానీ సాధారణంగా వచ్చే వాసన కాకుండా ప్రత్యేకంగా దుర్వాసన వస్తుంటే మాత్రం అది స్త్రీ, పురుషులిద్దరిలోనూ మూత్ర నాళ ఇన్ఫెక్షన్ కి సూచన. సాధారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ లో కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
- మూత్ర విసర్జనలో మంట, నొప్పి.
- తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది.
- మూత్ర విసర్జన ప్రతిసారి అత్యవసరంగా మారుతుంది. ఇన్ కాంటినెన్స్ సమస్య వస్తుంది.
- మూత్రం తెల్లగా చిక్కగా ఉన్నట్లు ఉంటుంది.
- ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది.
- పొత్తికడుపులో నొప్పి, నడుము కింద భాగంలో నొప్పి, పక్కటెముకల్లో నొప్పి ఉంటుంది.
- ఒక్కోసారి చలితో కూడిన జ్వరం కూడా ఉంటుంది.
గాయాల నుంచి దుర్వాసన
శరీరంలో ఎక్కడైనా గాయమైనపుడు ఆగాయం మానేందుకు చాలా సమయం తీసుకుంటూ, గాయం నుంచి దుర్వాసన వస్తుంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం అవసరమని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
గాయం చాలా బలంగా తగిలినపుడు, చాలా పెద్ద గాయం అయినపుడు, గాయంలో ఏదైనా ఇరుక్కున్నపుడు. శుభ్రం చెయ్యడానికి చాలా కష్టంగా ఉన్నపుడు, ఏదైనా ముఖ్యమైన రక్తనాళానికి లేదా కీలుకు దగ్గరగా గాయం అయినపుడు, ఎర్రగా మారి చీము పట్టినపుడు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఏదైనా జంతువు లేదా కీటకం వల్ల గాయం అయితే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించడం అవసరం.
Aslo read : Disease X: డిసీజ్ X - ఇది కోవిడ్ కంటే ప్రమాదకర మహమ్మారి, మరో ముప్పు తప్పదా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.