Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. దేశంలోని రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట ఘటన ఇదే మొదటిది కాదు. చాలా చోట్ల తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Stampedes At Railway Stations Of India: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. వీరిలో 14 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. రైల్వేస్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫామ్‌లపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పరిమితికి మించి జనం గుమిగూడడంతోనే తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీ సంఖ్యలో రైల్వేస్టేషన్‌కు చేరుకోగా.. అప్పటికే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరిగి జనాలు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట ఘటన ఇదే మొదటిది కాదు. విపరీతమైన రద్దీ, అధికారుల వైఫల్యంతో గతంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఆ ఘటనలేంటో చూద్దాం రండి..
* బాంద్రా స్టేషన్‌లో గతేడాది అక్టోబర్ 24న
మహారాష్ట్ర ముంబయిలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో గతేడాది అక్టోబర్ 24న తొక్కిసలాట జరిగి 10 మంది గాయపడ్డారు. దీపావళి, ఛత్ పండగల కోసం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లడానికి బాంద్రా–గోరఖ్‌పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది.
* ఎల్ఫిన్‌స్టోన్ స్టేషన్‌లో 22 మంది మృతి
2017 సెప్టెంబర్ 29న మహారాష్ట్ర ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 22 మంది మరణించారు. 39 మంది గాయపడ్డారు. ఎల్ఫిన్‌స్టోన్, పరేల్ సబర్బన్ స్టేషన్‌లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. ఆఫీస్ వేళల్లో విపరీతమైన రద్దీ కారణంగా దుర్ఘటన జరిగింది.
* అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో 36 మంది..
2013లో కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 36 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మౌని అమావాస్య స్నానం తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు అలహాబాద్ జంక్షన్‌కు లక్షన్నర మందికి పైగా భక్తులు తరలిరావడంతో ప్లాట్‌ఫారమ్ నంబర్ 6లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈ సంఘటన జరిగింది.
* వారణాసిలో గంగాస్నానం ముగించుకుని వస్తూ..
2007 అక్టోబర్ 3న ఉత్తర ప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా 14 మంది మహిళలు మరణించారు. 40 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. జూతీయ వ్రతం సందర్భంగా వారణాసిలో గంగాస్నానం ముగించుకుని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆ స్టేషన్‌కు ఇప్పుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా పేరు మార్చారు.
* ఫ్లాట్‌ఫామ్ మార్చడంతో పరిగెత్తుతూ..
2004 నవంబర్ 13న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఛత్‌పూజ కోసం ఇళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు భారీ సంఖ్యలో బిహార్‌కు వెళ్లే రైలు కోసం ఓ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. అయితే అకస్మాత్తుగా రైలు వచ్చే ఫ్లాట్‌ఫామ్ మార్చడంతో ఆ రైలు ఎక్కేందుకు పరిగెడుతూ ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది.
* లక్నో రైల్వేస్టేషన్‌లో 16 మంది బీఎస్పీ కార్యకర్తలు మృతి
2002 సెప్టెంబరు 28 చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 16 మంది బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బీఎస్పీ ర్యాలీ కోసం వేలాది మంది కార్మికులు లక్నో చేరుకోగా తొక్కిసలాట జరిగింది. ర్యాలీగా వెళుతున్న కార్యకర్తల్లో ఒకరు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై పడటంతో.. అతడిని తొక్కివేయకుండా మరికొందరు రక్షించడానికి ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళంలో తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో కొందరు సద్భావనా ఎక్స్‌ప్రెస్ పైకి ఎక్కగా హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

