Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి సత్యకుమార్ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప లాంటి సినిమాతో సమాజానికి ఎలాంటి ఎలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నించారు.

Minister Satya Kumar on Movies: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి సత్యకుమార్ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో గురురాజా పాఠశాల 23వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలి కానీ బందిపోట్లు, స్మగ్లర్ల సినిమాలు తీయడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. సమాజానికి ఇలాంటి సినిమాలు మంచివికాదన్నారు.
స్మగ్లర్లు ఆరాధ్య కథానాయకులవుతున్నారు
సత్య కుమార్ మాట్లాడుతూ.. ‘వీరప్పన్, పూలన్ దేవిల బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు. స్మగ్లర్ల పై కూడా సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి సినిమాల వల్ల ఏమి నేర్చుకోవాలి. గతంలో హీరోలు ఇలాంటి సినిమాలు చేసినా.. ఆయా సినిమాల్లో చివర్లో హీరోలు పశ్చాతాపం కారణంగా మారిపోయినట్టు చూపించేవారు. కానీ ఇప్పటి సినిమాల్లో డాన్లు హీరోలవుతున్నారు. స్మగ్లర్లు ఆరాధ్య కథానాయకులవుతున్నారు’ అని అన్నారు. సినిమాల్లో దొంగతనం చేసేవాడిని హీరోగా ఆరాధించే వారు.. నిజ జీవితంలో అలా ఓ దొంగను చూస్తారా అని అడిగారు. పుష్ప సినిమాను చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు.
పుష్ప-2 చూపించి చిన్నారులకు ఏం నేర్పిస్తున్నారు?
‘ఐటెం సాంగ్స్ పెట్టి రూ.వందల కోట్ల కలెక్షన్లు వచ్చాయని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఓటీటిలో పుష్ప-2 చిత్రాన్ని చిన్నారులకు చూపిస్తున్నారు. దీనివల్ల చిన్నారులకు ఏం నేర్పిస్తున్నారు. స్మగ్లర్లలా మారాలనా? సమాజంలో ఇలాంటి సినిమాలు మంచివి కాదు. ఆదర్శవమైన వ్యక్తులపై బయోపిక్ చిత్రాలు రావాలి. జన్మించిన ఊరు, సమాజం కోసం శ్రమించే వాళ్ల కథలను సినిమాలుగా తీయాలి.’ అని సత్యకుమార్ అన్నారు.
మంత్రిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
మంత్రి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమాను సినిమాలానే చూడాలి కానీ ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో చూపించేదంతా నిజం కాదని, అది కేవలం నటన మాత్రమేనని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా వివిధ అవార్డులు అందుకున్న హీరోలు ఇలాంటి కథలతో సినిమాలు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

