Sleeping Tips : పగటి పూట నిద్ర పోతున్నారా? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న కునుకు తీస్తే శరీరానికి రిలాక్స్ గా ఉంటుంది. పగటి నిద్ర మంచిది కాదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇంకొందరు పగటిపూట నిద్ర అవసరమంటారు. ఎవరి వాదన కరెక్టో తెలుసుకుందాం.
పగటిపూట చిన్న కునుకు తీస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అని వైద్యులు చెబుతున్నారు. అయితే రాత్రి నిద్ర కన్నా కూడా తక్కువ సమయం పగటిపూట పడుకున్నట్లయితే మెదడు రిఫ్రెష్ అవుతుంది. నిద్ర అనేది శరీరానికి మాత్రమే కాకుండామెదడుకు కూడా చాలా ముఖ్యమైనది. నిద్ర అవసరం ఒక్కో వ్యక్తికి వేరుగా ఉంటుంది.
సాధారణంగా 7-8 గంటల నిద్ర మంచిగా పరిగణించబడుతుంది. కానీ చాలా సార్లు ఉద్యోగం, కుటుంబం లేదా ఇతర బాధ్యతల కారణంగా చాలా త్వరగా ఉదయాన్నే లేవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో మధ్యాహ్నం నిద్ర అవసరం అవుతుంది. పెరుగుతున్న పనిభారం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన వాతావరణంలో, పగటిపూట నిద్రపోవడం తరచుగా రిఫ్రెషింగ్ అనుభవం అందిస్తుంది.
మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మధ్యాహ్నం పూట నిద్రపోతే చాలా రిలాక్స్‌గా ఉంటుంది. మధ్యాహ్నం నిద్ర శరీరానికే కాదు, మనసుకు కూడా చిన్న విశ్రాంతిని ఇస్తుంది. పగటిపూట దాదాపు 1 గంట నిద్రపోవడం వల్ల శరీరం మొత్తం కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఈ నిద్రతో శరీరం, మనస్సు విశ్రాంతి పొందుతాయి. అలాగే నిద్ర మేల్కొన్న తర్వాత మీరు రిఫ్రెష్‌గా ఉంటారు.
- చాలా సార్లు రాత్రి పూట ప్రయాణం చేసినప్పుడు, లేదా అర్థ రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా మీ నిద్రకు భంగం కలుగుతుంది. ఈ సమయంలో మధ్యాహ్నం నిద్ర పోవడం ద్వారా మీ అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.
- ముఖ్యంగా గృహిణులు ఉదయాన్నే లేచి ఇంటి పనులను చూసుకోవడం, అర్థరాత్రి వరకు పనులు చేస్తూ బిజీగా ఉంటారు. ఈ కారణంగా, వారు పగటిపూట గంట సేపు నిద్ర పోతే వారి అలసట దూరం అవుతుంది. మధ్యాహ్నం నిద్ర చురుకుదనాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
- నిజానికి రోజు మొత్తంలో 6-8 గంటల నిద్ర అవసరం. కానీ ఒక్కో సారి రాత్రిపూట నిద్ర పట్టదు. అలాంటి వారికి సరైన నిద్రలేకపోతే చిరాకు, మూడ్ స్వింగ్, ప్రవర్తనలో మార్పులు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు నిద్రపట్టనివారు, పగటిపూట కునుకు తీస్తే వారి మానసిక స్థితి మెరుగుపడుతుంది.
- మధ్యాహ్నం పడుకునే చిన్నపాటి నిద్ర జ్ఞాపకశక్తిపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ చేసే వారికి అయితే పని చేయగల సామర్థ్యం పెంచుతుంది.
మధ్యాహ్నం నిద్ర అందరికీ అవసరమా? :
నిజానికి ప్రతి వ్యక్తికి పగటి నిద్ర అవసరం లేదని పాత తరం వారు చెబుతుంటారు. కేవలం చంటి పిల్లలు, వృద్ధులు, గర్భిణులు లేదా అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే పగటిపూట విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంటారు. కానీ ఇప్పుడు జీవనశైలిలో మార్పుల ఫలితంగా చాలా మందికి ఈ పగటి నిద్ర అవసరంగా మారింది. .
పగటి పూటన నిద్రపోవాల్సి వస్తే, ఈ విషయాలను గుర్తుంచుకోండి :
- పగటి పూట గంట నుంచి అరగంట మాత్రమే నిద్ర పోవాలి. దీని కంటే ఎక్కువసేపు నిద్రపోవడం మీ శరీరానికి మంచిది కాదు.
- మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిద్రపోకూడదు. అలా నిద్రపోవడం వల్ల మీ రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది.
- మీరు నిద్రించినప్పుడల్లా, మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మీరు మేల్కొన్నప్పుడు రిఫ్రెష్‌గా ఉంటారు.
Also Read : టిన్స్ మీద టిన్స్ తాగేస్తున్నారా? ఈ కూల్ డ్రింక్ క్యాన్స్‌తో ఇలాంటి ప్రమాదం కూడా ఉందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.