Women Heart: మహిళలూ జాగ్రత్త, మీ గుండెకే ఒత్తిడి ఎక్కువ
ఆడవాళ్లు గుండెను జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. లేకుంటే సమస్యలు త్వరగా వచ్చేస్తాయి.
ఆడవాళ్లకు ఇది ఓ హెచ్చరికే. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, పిల్లలు, ఇంటి పనులు... ఇలా పది రకాల పనుల్లో ఇరుక్కున్న మహిళలు తమకు తెలియకుండానే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇది ఒకరోజో, రెండు రోజులో కాదో ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి. ఆ ఒత్తిడి వారికి తెలియకుండానే హార్మోన్లలో అసమతుల్యతకు కారణం అవుతుంది. అది కాస్త దీర్ఘకాలం కొనసాగితే వివిధ రకాల సమస్యలతో పాటూ చివరకు గుండె పోటుకు కారణం అవుతుంది. ఈ విషయం స్వీడన్లోని కరోలిన్‌స్కా ఇన్ స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో తేలింది.
బ్రోకెన్ హార్ట్ సమస్య...
బ్రోకెన్ హార్ట్ బారిన పడేది ఎక్కువ మహిళలే. అంటే తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగాలకు గురై, దాని వల్ల వచ్చే గుండె పోటునే బ్రోకెన్ హార్ట్ అంటారు. ఇది అధికంగా స్త్రీలకే వస్తుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. గుండె పోటు బారిన పడుతున్న ఆడవారిలో పది శాతం మందిలో ఎలాంటి ప్రధాన కారణం కనిపించడం లేదు. వారి గుండె రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు బయటపడలేదు. దీన్ని బట్టి కేవలం బ్రోకెన్ హార్ట్ పరిస్థితుల వల్లే వారు గుండె పోటుకు గురవుతున్నట్టు గుర్తించారు.
భావోద్వేగాలు అతిగా ప్రదర్శిస్తే గుండె పనితీరు నెమ్మదిగా మారిపోతుంది. ఇది పూర్తిగా మానసిక ఒత్తిడితో ముడిపడి ఉందని చెబుతున్నారు పరిశోధకులు. ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయుల్లో తేడాలు కూడా ఒత్తిడిని పెంచేస్తుంది. కాబట్టి మహిళలు ఏమాత్రం తేడా అనిపించినా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే గుండె వైద్యుడిని సంప్రదించాలి. కావాల్సిన పరీక్షలు చేయించుకుని గుండె పోటు వచ్చే అవకాశం ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దగ్గరివారితో తీవ్ర వాగ్వాదాలు జరిగినప్పుడు, ఆత్మీయులు చనిపోయినప్పుడు తీవ్ర బాధతో కూడిన ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల అధికంగా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వస్తుంది.
గుండెపోటుకు, బ్రోకెన్ హార్ట్ కు తేడా?
గుండె పోటు అనేది ధమనుల్లో పూడికలు ఏర్పటినప్పుడు రక్త సరఫరా సరిగా జరగక వస్తుంది. అదే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లో రక్తనాళాలు బాగానే ఉంటాయి. అయినా గుండెపోటు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. పురుషుల్లో కన్నా మహిళల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
యాభై ఏళ్లు దాటిన మహిళల్లో, అలాగే యాంగ్జయిటీ లేదా డిప్రెషన్ మందులు వాడుతున్న స్త్రీలలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వచ్చే అవకాశం అధికం.
Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు
Also read: బస్సులో పట్టేంత మందిని ఆటోలో ఎక్కించేశాడు, పోలీసులకే దిమ్మదిరిగింది, వైరలవుతున్న వీడియో