Lightning: పిల్లాడు కాదు పిడుగు.. మెరుపు తాకినా బతికేశాడు, అవే రక్షించాయి!
ఓ పిల్లాడు వేసుకున్న రబ్బరు బూట్లు అతడి ప్రాణాలను కాపాడాయి.
వానాకాలంలో ఉరుములు, మెరుపులు ఏర్పడడం సాధారణమే. మేఘాల్లోని ధన, రుణవేశాల కారణంగా ఏర్పడే శక్తిని మెరుపు అంటారు. అది ఒకరకమైన విద్యుత్తు వంటిది. ఈ మెరుపులు వివిధ ఆకారాల్లో జిగ్ జాగ్ మార్గాలలో భూమిని తాకుతాయి. అలా ఒక మెరుపు ఓ పిల్లాడిని తాకింది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు ఆ కుర్రాడు. అతడి ప్రాణాలను కాపాడింది ఆ పిల్లాడు వేసుకున్న రబ్బరు బూట్లే. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
పద్నాలుగేళ్ల పిల్లాడు టాలిన్ రోస్ రోజూలానే అమ్మతో కలిసి కారులో స్కూలుకి వెళ్లాడు. కారు దిగి అమ్మకి టాటా చెప్పి స్కూలు గేటు వైపు నడుస్తుండగా ఒక్కసారిగా ఓ మెరుపు అతడిని తాకింది. కొన్ని నిమిషాల పాటూ అతడు షాక్ కు గురయ్యాడు. అక్కడే కూలబడిపోయాడు. ఇదంతా కారులో కూర్చున్న వేరే పిల్లాడి తండ్రి చూశాడు. అతడు వెంటనే పరిగెత్తుకుని వచ్చి టాలిన్ ను స్కూల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి, ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడు వేసుకున్న రబ్బరు బూట్ల వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పారు. ఆ మెరుపులోని విద్యుత్తును ఆ రబ్బరు బూట్లు గ్రహించాయని దాని వల్ల పిల్లాడి శరీరానికి విద్యుత్ ప్రవాహం ఎక్కువ జరగలేదని చెప్పారు. ఆ మెరుపు ముందుగా ఓ మెటల్ స్థంభానికి తగిలి, అక్కడ్నించి రిఫ్లెక్ట్ అయి పిల్లాడికి తగిలినట్టు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
టాలిన్ మాట్లాడుతూ తనను ఏదో బలమైన శక్తి తాకినట్టు అనిపించిందని, కొన్ని నిమిషాల పాటూ తనకు ఏదీ వినిపించలేదని చెప్పాడు. అంతేకాదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో గుర్తించలేని స్థితి ఏర్పడిందని, చలనం లేనట్టు అయిపోయిందని తెలిపాడు. ప్రస్తుతం టాలిన్ పూర్తిగా కోలుకున్నాడు. ఆ రోజు రబ్బరు బూట్లు వేసుకోకపోతే మాత్రం ప్రభావం గట్టిగానే పడేదేమో.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే...
Also read: కూర్చుని - నిల్చునే ఈ టెస్ట్ చెప్పేస్తుంది... వచ్చే అయిదేళ్లలో మీ ఆరోగ్యం గురించి
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు