Mahesh Babu: ఎక్కడికి వెళ్లినా మహేష్ బాబు టోపీతో ఎందుకు కనిపిస్తున్నాడు? జక్కన్న సినిమాకు ఏమైనా లింక్ ఉందా?
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గత కొంతకాలంగా ఎక్కడకు వెళ్లినా టోపీ పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ వెకేషన్స్ లోనూ క్యాప్ తోనే దర్శనం ఇస్తున్నాడు. ఇంతకీ ఆయన టోపీ వెనుకున్న కథేంటో తెలుసా?
Mahesh Babu Cap: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కబోతోంది. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథాంశంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మహేష్ బాబు క్యాప్ తో ఎందుకు కనిపిస్తున్నారు?
SSMB29 చిత్రంలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు, గత కొద్ది రోజులు ఎక్కడకు వెళ్లినా టోపీ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఫ్యామిలీ వెకేషన్స్ తో పాటు ఇతర కార్యక్రమాలలోనూ ఆయన క్యాప్ తోనే ఉంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు క్యాప్ లో ఎందుకు కనిపిస్తున్నారో తెలుసుకోవాలని పలువురు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ బాబు చాలా కష్టపడుతున్నారు. తన పాత్రకు తగినట్లుగా లుక్, బాడీ షేప్ మార్చుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రెయినర్స్, హెయిర్ స్టైలిస్టుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రపంచ యాత్రికుడిగా కనిపించనున్న నేపథ్యంలో హెయిర్ స్టైల్ స్పెషల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ చిత్రంలో నయా హెయిర్ స్టైల్ లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ లుక్ బయటకు రివీల్ కాకూడదనే క్యాప్ తో కనిపిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జక్కన్న సినిమాల్లో స్పెషల్ హెయిర్ స్టైల్ ఉండాల్సిందే!
రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరోల హెయిర్ స్టైల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. తన సినిమాలో హీరో జుట్టు పొడవుగా ఉండేలా చూసుకుంటారు. ‘యమదొంగ’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పొడవైన జుట్టులో కనిపించారు. అంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ కూడా పొడవైన జుట్టుతోనే కనిపించారు. భైరవ పాత్రకు సూటయ్యేలా ఆయన హెయిర్ స్టైల్ సెట్ చేశారు. ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ ప్రభాస్, రానా జుట్టు కూడా పొడవుగానే ఉంటుంది. ‘RRR’ సినిమాలోనూ రామ్ చరణ్ జుట్టు పొడవుగానే ఉంటుంది. SSMB29 చిత్రంలోనూ మహేష్ జుట్టు స్పెషల్ గా ఉంబోతున్నట్లు తెలుస్తోంది. ఆ లుక్ బయటకు కనిపించకుండా ఉండేందుకే గత కొంతకాలంగా క్యాప్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
అల్యుమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్స్
SSMB29 సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద సెట్స్ వేస్తున్నారు. అక్కడే వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగున్నట్లు తెలుస్తోంది. ఈ సెలెక్షన్ పూర్తి చేసి త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని మహేష్ అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. కెఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.