Vani Jayaram Funeral : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - మృతిపై మిస్టరీ గుట్టువిప్పే పనిలో పోలీసులు
Vani Jayaram Death : చెన్నైలో వాణీ జయరామ్ అంత్యక్రియలు ముగిశాయి. దిగ్గజ గాయానికి అభిమానులు, చిత్రసీమ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది.
![Vani Jayaram Funeral : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - మృతిపై మిస్టరీ గుట్టువిప్పే పనిలో పోలీసులు Vani Jayaram Last Rites Chennai Veteran singer Vani Jayaram Final Rites Funeral Vani Jayaram Funeral : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - మృతిపై మిస్టరీ గుట్టువిప్పే పనిలో పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/05/9643c89086e49ac12fc1f5b8ddbbffcb1675580700594313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇల గొంతు వెళ్ళిపోయింది... దిగ్గజ గాయని తిరిగి రాని లోకాలకు తరలింది... వాణీ జయరామ్ (Vani Jayaram) శనివారం ఉదయం అనుమానాస్పద రీతిలో కన్ను మూశారు. ఆమె అంతిమ సంస్కారాలు నేడు చెన్నైలో నిర్వహించారు. కడసారి ఆమెను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు తరలి వచ్చారు. దిగ్గజ గాయానికి కన్నీటి వీడ్కోలు పలికారు.
బంధువులే వారసులై...
వాణీ భర్త జయరామ్ ఐదేళ్ళ క్రితం (2018లో) మరణించారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. సంగీతమే తమకు పిల్లలు లేని లోటు తీర్చిందని ఆమె చెబుతూ ఉండేవారు. బంధువులే వారసులై ఈ రోజు వాణీ జయరామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Vani Jayaram Final Rites : చెన్నైలోని దిగ్గజ గాయని స్వగృహం నుంగంబాక్కం నివాసం నుంచి బీసెంట్ నగర్ శ్మశాన వాటిక వరకు వాణీ జయరామ్ అంతిమ యాత్ర సాగింది. మిన్ మయన్ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ కార్యక్రమాలు జరిగాయి. వాణీ జయరామ్ మృతికి గౌరవంగా పోలీసులు గౌరవాలతో నివాళులు అర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయం ప్రకారం చివరికి కార్యక్రమాలు పూర్తి చేశారు.
మృతిపై ఇంకా వీడని మిస్టరీ
వాణీ జయరామ్ (Vani Jayaram Death) మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. శనివారం చెన్నైలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో పని మనిషి ఇంటికి వెళ్ళడంతో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎంత సేపటికీ వాణీ జయరామ్ తలుపు తీయకపోవడంతో బంధువులు, సన్నిహితులకు ఆమె సమాచారం అందించారు. రక్తపు మడుగులో పడి ఉన్న వాణీని ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా... మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తలపై గాయం నిజమే
చెన్నై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వాణీ జయరామ్ పోస్టుమార్టంలోనూ తలకు గాయమైన విషయం వెలుగులోకి రావడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు నెలకొన్నాయి. పోస్టుమార్టం పూర్తి నివేదిక వస్తే గానీ గాయానికి గల కారణాలు వెల్లడించలేమని వైద్యులు, పోలీసులు పేర్కొన్నారు. దాంతో ఆమె మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
వాణీ జయరామ్ అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో అయ్యంగార్ కుటుంబంలో నవంబర్ 30, 1945 జన్మించారు. కర్ణాటక సంగీతంలో చిన్నతనం నుంచి శిక్షణ తీసుకున్నారు. ఎనిమిదేళ్ళ వయసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. చదువు పూర్తైన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఆమె మామగారు కూడా కర్ణాటిక్ సింగర్ కావడంతో ఆయన ప్రోత్సాహంతో గాయనిగా అడుగులు వేశారు.
Also Read : నాగార్జున 'ఘోస్ట్' టీజర్‌లా ఉందేంటి? దళపతి విజయ్ 'లియో'పై ట్రోల్స్
'గుడ్డీ'తో వాణీ జయరామ్ చిత్రసీమకు పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి, ఒరియా, తుళు... సుమారు 19 భాషల్లో ఆమె పాటలు పాడారు. 50 ఏళ్ళ పాటు ప్రేక్షకులను అలరించారు. వాణీ జయరామ్ 50 ఏళ్ళ కెరీర్ లో మొత్తం మీద 10 వేల పాటలకు పైగా పాడారు. అందులో తెలుగు పాటలు వెయ్యి కంటే ఎక్కువే.
వాణీ జయరామ్ ఉత్తమ గాయనిగా మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ 'అపూర్వ రాగంగాళ్'లో పాటలకు గాను ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. మిగతా రెండు సార్లు కె. విశ్వనాథ్ 'శంకరాభారాగం', 'స్వాతి కిరణం' సినిమాల్లో పాటలు అనుకోవడం విశేషం. చిత్రసీమకు ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం నాడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అది అందుకోక ముందు కన్నుమూయడం విషాదమని అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)