(Source: ECI/ABP News/ABP Majha)
Tollywood drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నిజాలు చెప్పడం లేదా? ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్స్‌జ్ శాఖ మరోసారి సెలబ్రిటీలకు క్లీన్ చీట్ ఇచ్చింది. కెల్విన్ కేసును తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని పేర్కొంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్.. వాస్తవాలు చెప్పడం లేదా? అతడు కావాలనే టాలీవుడ్ తారలను ఇరికిస్తున్నాడా? ఈ ప్రశ్నలకు ఎక్సైజ్ అధికారులు ఔననే సమాధానం చెబుతున్నారు. అధికారులు ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌ను రంగారెడ్డి కోర్టులో దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మరోసారి టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చీట్ ఇచ్చింది. నిందితులు, సాక్షుల్లో సెలబ్రిటీల పేర్లను చేర్చలేదు.
కెల్విన్ మాటలు నమ్మశక్యంగా లేవని, అతడు చెప్పిన వివరాల ఆధారంగా సెలబ్రిటీలను నిందితులుగా చేర్చలేమని అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలేవీ లభించలేదని తెలిపారు. కెల్విన్ సినీ తారలు, విద్యార్థులు, హోటల్ నిర్వాహకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్లు వాగ్మూలం ఇచ్చాడని తెలిపారు. అతడు చెప్పిన వివరాల మేరకు సిట్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారించినట్లు అందులో పేర్కొన్నారు.
పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చారని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. వారి శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తెలిపిందన్నారు. సిట్ అన్నిరకాల సాక్ష్యాలను పరిశీలించిందని, సెలబ్రిటీలపై కెల్విన్ అందించిన వివరాలు నమ్మేవిధంగా లేవని తెలిపారు. అతడి వాంగ్మూలం కేసును తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. కేవలం నిందితుడు చెప్పిన వివరాలను బలమైన ఆధారాలుగా భావించలేమన్నారు. కెల్విన్ చెప్పిన సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ లభించలేదన్నారు. కెల్విన్ మంగళూరులో చదువుకున్నప్పుడే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని తెలిపారు. 2013 నుంచి డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడని, గోవా, విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకోనేవాడని వివరించారు. ఈ కేసుతో కెల్విన్ స్నేహితుడు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయం ఉందన్నారు. వాట్సాప్ ద్వారా డ్రగ్స్ విక్రయించేవారని పేర్కొన్నారు. సోదాల సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలిపారు.
2016లో హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో నటుడు నవదీప్‌కు చెందిన ‘ఎఫ్-క్లబ్’ ప్రారంభం నుంచి టాలీవుడ్ స్టార్స్‌కు ఈ తలనొప్పి మొదలైంది. ఆ రోజు నవదీప్ ఆహ్వానం మేరకు ఆ క్లబ్‌లో పార్టీకి హాజరైన తారలే ఎక్సైజ్ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా ఈడీ విచారణకు సైతం హాజరువుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ అక్రమ సరఫరా నిందితుడు కాల్విన్ మస్కరేన్హాస్ సినీ ప్రముఖులను కలిశాడని తెలిసింది. అతడి వద్ద కొందరు డ్రగ్స్ కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) 12 మంది సినీ ప్రముఖులను విచారించింది. ఆ క్లబ్ ద్వారా భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానం. ఈ నేపథ్యంలో అధికారులు క్లబ్‌ను సీల్ చేశారు. విచారణలో భాగంగా అధికారులు సెలబ్రిటీల గోళ్లు, రక్తం, వెంట్రుకలు తదితర శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. ఇప్పటివరకు ఈ కేసుపై మూడు చార్జిషీట్లు నమోదు కాగా.. ఒక్క దాన్లో కూడా సెలబ్రిటీలను నిందితులుగా పేర్కొలేదు.
Also Read: విమానం మధ్య సీట్లోని ఆర్మ్‌రెస్ట్ ఎవరు ఉపయోగించాలో తెలుసా?
సినీ ప్రముఖుల పేర్లు చార్జిషీట్‌లో లేకపోవడం, డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న 62 మంది బాధితులని పేర్కొనడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద మరోసారి డ్రగ్స్ కేసును విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఈడీ 12 మందికి నోటీసులు పంపింది. అయితే అప్పట్లో సిట్ విచారణలో లేని రకుల్ ప్రీత్, రాణాలను ఈసారి ఈడీ విచారిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణకు హాజరైంది. ఆమెతోపాటు బాలీవుడు నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్లను కూడా ఎన్‌సీబీ విచారించింది. ఈడీ ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటిని, రవితేజ, శ్రీనివాస్, నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందులను విచారించారు. 22న తరుణ్ విచారణతో ఈడీ ఎంక్వైరీ ముగుస్తుంది. మరి, ఈడీ నుంచి మన తారలకు క్లీన్ చీట్ లభిస్తోందో లేదో చూడాలి.
Also Read: 12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్ర.. ఏ రోగం లేకుండా భలే బతికేస్తున్నాడు, అదెలా సాధ్యం?