Naga Vamsi: ఆడియన్స్ కి సారీ చెప్పిన 'భీమ్లానాయక్' ప్రొడ్యూసర్, ఆ వార్తలు విని బాధపడ్డా!
నాగవంశీ నిర్మించిన 'డీజే టిల్లు' సినిమా ఇటీవల విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగవంశీకి కలెక్షన్స్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్నో హిట్టు సినిమాలను నిర్మించిన నాగవంశీ మీడియాలో పెద్దగా కనిపించరు. ఒకవేళ ప్రెస్ మీట్స్ కి హాజరైనా.. చాలా సైలెంట్ గా కనిపిస్తారు. కానీ ఆయన గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఆయనొక 'అర్జున్ రెడ్డి' అని చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో మీడియా ముందుకొస్తూ.. నాగవంశీ చేస్తోన్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
ఆయన నిర్మించిన 'డీజే టిల్లు' సినిమా ఇటీవల విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగవంశీకి కలెక్షన్స్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. 'ఈ లెక్కలన్నీ మనలాంటి మేధావులకు కావాలి కానీ ఆడియన్స్ గా వాడు ఇచ్చే 150 రూపాయలకు నవ్వుకున్నాడా లేదా అనేది సరిపోతుంది. వాడిచ్చిన 150 రూపాయలకు 1500 నవ్వించేశాం.. చాలు వాడు హ్యాపీ' అని చెప్పారు.
ఆడియన్స్ ను వాడు, వీడు అని సంబోధిస్తూ మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగవంశీని ట్రోల్ చేశారు. ఈ ఎఫెక్ట్ తన సినిమాపై కూడా పడుతుండడంతో ప్రేక్షకులను క్షమాపణలు కోరారు నాగవంశీ. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
''ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థ కైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో 'డిజె టిల్లు' విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనం తో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించటం వల్లే. అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం'' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'భీమ్లానాయక్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందించారు.
— Naga Vamsi (@vamsi84) February 18, 2022
— Retired Fan (@KotiprinceYadav) February 18, 2022