Adipurush Postponed: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన 'ఆదిపురుష్', సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందా ?
'ఆదిపురుష్' సినిమా ను సంక్రాంతి బరిలో జనవరి 12 న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అంతకుముందు ముందు ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధే శ్యాం' సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అందుకే 'ఆదిపురుష్' పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12 న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా 2023 సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటనలు ఏమి రాలేదు, అయితే వాయిదా పడిన విషయం మాత్రం దాదాపు కన్ఫమ్ అయినట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సంక్రాంతికి ప్రభాస్ సినిమా చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యేలా ఉంది. దీంతో ఇదేంటి ఇలా చేశారు అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ !
సినిమా అసలు ఎందుకు వాయిదా పడిందా అని అందరూ ఆలోచిస్తున్నారు. కొంతమంది థియేటర్లు సరిగ్గా దొరకక వాయిదా వేస్తున్నారని అంటున్నారు. కొంతమంది గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ అవ్వడం వలన వాయిదా వేశారు అంటున్నారు. ఏదేమైనా సినిమా రిలీజ్ నిజంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై ముందునుంచీ విమర్శలు వస్తున్నాయి. సినిమా టీజర్ కు సంబంధించిన గ్రాఫిక్స్ నాసిరకంగా ఉందంటూ విమర్శలు చేశారు. ప్రభాస్ ను రాముడిలా చూద్దామనుకుంటే మీరేంటి ఇలా బొమ్మలు చూపిస్తున్నారు అని ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్ ను ఆడేసుకున్నారు. తర్వాత ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకే గ్రాఫిక్స్ పై మరింత దృష్టి పెట్టి సినిమాను మరింత సహజంగా రూపొందించాలని చూస్తున్నారట మూవీ టీమ్.
రూ.500 కోట్ల బడ్జెట్ సినిమా
మరోవైపు సంక్రాంతి సీజన్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడం, ఇతర భాషల్లో కూడా సినిమాలు భారీగా రిలీజ్ అవ్వడంతో సినిమాను వాయిదా వేస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. 'ఆదిపురుష్' సినిమా పై విమర్శలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఈ సినిమా ను రామాయణం ఇతివృత్తం ఆధారంగా తీయడంతో సినిమాలో రామాయణాన్ని వక్రీకరించారని కొంతమంది కోర్ట్ కు కూడా వెళ్లారు. మొత్తంగా ఈ సినిమా విడుదలకు ముందే ఇలా వివాదాలతో మరింత ప్రచారంలో ఉంటుంది. ఇక ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ కథానాయికగా సీత పాత్రలో కనిపించనుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడు పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 20 వేలకు పైగా స్క్రీన్ లలో ప్రదర్శించనున్నారట. ప్రభాస్ ఈ సినిమా కోసం అత్యధిక రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ సినిమా విడుదల తేదీ పై వస్తోన్న వార్తలపై సినిమా నిర్మాణ సంస్థ టి సిరీస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.