Best Thriller Movies On OTT: 25వ అంతస్తులో.. సొంత ఇంట్లో ఇరుక్కుపోతాడు, బొద్దింకలను తింటూ.. ఆకలి తీర్చుకుంటాడు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?
Trapped movie explained in telugu: మీ ఇంట్లో మీరే ఇరుక్కుపోతే? మీరు ఎంత అరిచినా.. ఎవరికీ వినపడకపోతే? చిన్న పాయింట్‌తో.. ఉత్కంఠ రేపే మూవీ ఇది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోెందంటే?
Best Thriller Movies On OTT: సర్వైవల్ డ్రామా చిత్రాలను చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. కానీ అలాంటి సినిమాలను కూడా ప్రత్యేకంగా ఇష్టపడే మనుషులు ఉంటారు. పైగా కొన్నేళ్లుగా ఈ జోనర్ సినిమాలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవి చాలావరకు సక్సెస్ అవుతున్నాయి కూడా. అలా బాలీవుడ్‌లో తెరకెక్కిన బెస్ట్ సర్వైవల్ డ్రామా చిత్రాల్లో ‘ట్రాప్డ్’ (Trapped) ముందుంటుంది. బాలీవుడ్ మేకర్స్ బయోపిక్స్‌ను మాత్రమే కాదు.. సర్వైవల్ డ్రామాలను కూడా బాగా తెరకెక్కించగలరు అని చెప్పడానికి ఈ సినిమాను ఉదాహరణగా తీసుకోవచ్చు.
కథ..
‘ట్రాప్డ్’ మూవీ ఓపెన్ చేయగానే శౌర్య (రాజ్‌కుమార్ రావు) ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో పనిచేస్తుంటాడు. అదే ఆఫీస్‌లో తనకు నూరీ (గీతాంజలి తాపా) అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటారు. అదే సమయంలో శౌర్య.. నూరీని తన రూమ్‌కు తీసుకెళ్తాడు. కానీ ఆ రూమ్‌లో తనకు చాలామంది రూమ్‌మేట్స్ ఉన్నారు. మామూలుగా బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నూరీకి ఆ రూమ్ నచ్చదు. తనకంటూ ఒక సొంత ఫ్లాట్ ఉంటే బాగుంటుందని చెప్తుంది. దీంతో శౌర్య.. ఒక ఫ్లాట్‌ను వెతికే పనిలో పడతాడు. అప్పుడే ఒక బ్రోకర్ వచ్చి సగం కట్టి వదిలేసిన అపార్ట్‌మెంట్‌లోని 25వ ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్ చూపిస్తాడు. అంత పెద్ద అపార్ట్‌మెంట్‌లో అప్పటికీ రెండు కుటుంబాలు మాత్రమే ఉంటాయి. శౌర్యకు ఆ ఫ్లాట్ బాగా నచ్చుతుంది. వెంటనే తన రూమ్‌కు వెళ్లి కొన్ని సామాన్లు తీసుకొని ఆ ఫ్లాట్‌కు షిఫ్ట్ అయిపోతాడు. అక్కడే కథ మరో మలుపు తిరుగుతుంది.
ఇంకా పూర్తిగా కన్‌స్ట్రక్షన్ పూర్తి కాకపోవడంతో ఆ ఫ్లాట్‌లో నీళ్లు, కరెంటు ఏదీ ఉండదు. అయినా ముందు ఆఫీస్‌కు వెళ్దామని ఫ్లాట్‌కు లాక్ వేసి బయల్దేరుతాడు శౌర్య. హడావిడిలో ఫోన్‌ను ఇంట్లోనే మరిచిపోతాడు. సరిగ్గా బయటకు వచ్చిన తర్వాత ఫోన్ మోగుతుంది. దీంతో తాళాలు తీస్తాడు. అయితే, ఆ తాళాలను డోర్ బయటే వదిలేస్తాడు. ఇంతలో గాలికి తలుపు మూసుకుపోయి బయట నుంచి లాకైపోతుంది. అది తెరవాలంటే కీ ఉండాల్సిందే. మరోవైపు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. డోర్ తెరవాలనే ప్రయత్నంలో శౌర్యకి దెబ్బలు తగులుతాయి. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఫోన్‌ను పగలగొట్టేస్తాడు శౌర్య. 25వ ఫ్లోర్‌లో ఉండడంతో తను సాయం కోసం అరిచినా ఎవరికీ వినిపించదు. అక్కడ నీళ్లు, కరెంటు, ఆహారం ఏదీ ఉండదు. దీంతో తన మూత్రాన్ని తానే పట్టుకొని తాగడం, పావురాలను, బొద్దింకలను, చీమలను కూడా తినడం ప్రారంభిస్తాడు. అసలు ఆ 25వ ఫ్లోర్‌లోని అపార్ట్‌మెంట్ నుంచి శౌర్య ఎలా తప్పించుకుంటాడు అనేది తెరపై చూడాల్సిన కథ.
నటనతో నడిపించాడు..
ఒక నిస్సహాయ పరిస్థితిలో చిక్కుకున్న పాత్రలో రాజ్‌కుమార్ రావు నటన అద్భుతంగా ఉంటుంది. 1 గంట 40 నిమిషాల సినిమాలో ఎక్కువగా రాజ్‌కుమార్ రావును మాత్రమే చూడగలుగుతారు ప్రేక్షకులు. అలా తన నటనతో మాత్రమే మూవీ మొత్తాన్ని నడిపించగలిగాడు ఈ హీరో. ఇక సర్వైవల్ డ్రామాలో బోర్ కొట్టకుండా ప్రతీ సీన్‌ను ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు చూస్తుంటే ప్రేక్షకులకు అయ్యో పాపం అనిపించడం ఖాయం. ఒక మంచి బాలీవుడ్ సర్వైవల్ డ్రామాను చూడాలనుకునే ఆడియన్స్.. అమెజాన్ ప్రైమ్‌లోని ‘ట్రాప్డ్’ను చూసేయొచ్చు.