Best Thriller Movies On OTT: తన కోరిక తీర్చుకునేందుకు తల్లిదండ్రులను సైతం చంపేసే కూతురు - ఆమెను చూస్తేనే వణుకు పుట్టేస్తుంది, డోన్ట్ మిస్!
Movie Suggestions: థ్రిల్లర్ సినిమా అంటే తరువాత ఏం జరుగుతుంది అని ఉత్కంఠను క్రియేట్ చేయగలగాలి. కథతో మాత్రమే కాదు నటనతో కూడా అలాంటి ఆసక్తిని క్రియేట్ చేయవచ్చు అని నిరూపించింది ‘పర్ల్’.
Best Thriller Movies On OTT: ఒక్కొక్కసారి థ్రిల్లర్ సినిమాల్లో తరువాత ఏం జరుగుతుంది అనే విషయం ముందే అర్థమయినా ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం మిస్ అవ్వవు. అలాంటి ఒక సినిమానే ‘పర్ల్’ (Pearl). ఒక మనిషి ఒక కలకంటే దానిని నెరవేర్చుకోవడం కోసం ఎంత దూరమయినా వెళ్తాడని అంటుంటారు. అలాగే ఇందులో హీరోయిన్ కూడా తన కలను నెరవేర్చుకోవడం కోసం సొంత తల్లిదండ్రులనే చంపేస్తుంది. మానసిక పరిస్థితి బాలేని ఆ అమ్మాయి కల.. తన తల్లిదండ్రుల ప్రాణం తీసింది. ఇందులో హీరోయిన్ పాత్రను దర్శకుడు టీ వెస్ట్ అద్భుతంగా డిజైన్ చేశాడని ప్రేక్షకులు ఇప్పటికీ చెప్పుకుంటారు.
కథ..
‘పర్ల్’ కథ విషయానికొస్తే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సినిమా మొదలవుతుంది. అది 1918 సంవత్సరం. యుద్ధంలో పాల్గొనడం కోసం పర్ల్ (మియా గోత్) భర్త హావర్డ్ (అలిస్టైర్ సేవెల్) బోర్డర్‌కు వెళ్లిపోతాడు. దీంతో పర్ల్.. తన తల్లి రూత్ (టాండీ రైట్), తండ్రితో కలిసుంటుంది. తన తండ్రికి పక్షవాతం. వారికి ఒక యానిమల్ ఫార్మ్ ఉంటుంది. అక్కడ రకరకాల జంతువులు ఉంటాయి. ఆ ఫార్మ్‌ను చూసుకునే బాధ్యత పర్ల్‌కు అప్పగిస్తుంది రూత్. కానీ పర్ల్‌కు మాత్రం సినిమా, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా తను కూడా ఒక మంచి డ్యాన్సర్ కావాలని కలలు కంటుంది. అందుకే తన తల్లికి తెలియకుండా సినిమాలకు వెళ్తూ ఉంటుంది. తను రెగ్యులర్‌గా వెళ్లే సినిమా థియేటర్‌లోని ప్రాజెక్షనిస్ట్‌తో పర్ల్‌కు మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. భర్తను మిస్ అవుతున్న పర్ల్.. ప్రాజెక్షనిస్ట్‌కు దగ్గరవుతుంది.
అదే సమయంలో హావర్డ్ చెల్లెలు మిట్సీ ప్రాట్ (ఎమ్మా జెంకిన్స్ పర్రో).. పర్ల్ ఇంటికి వస్తుంది. దగ్గర్లోని చర్చిలో ఆడిషన్స్ జరుగుతున్నాయని, అందులో సెలక్ట్ అయితే డ్యాన్సర్‌గా అవకాశం ఇచ్చి, ఏడు దేశాలకు తిప్పుతారని చెప్తుంది. దీంతో పర్ల్‌కు కూడా ఆ ఆడిషన్స్‌కు వెళ్లాలని ఆశపడుతుంది. అదే విషయం వెళ్లి ఆ ప్రాజెక్షనిస్ట్‌కు చెప్తుంది. కానీ తనకు ఉన్న బాధ్యతల వల్ల తనకు నచ్చింది చేయలేకపోతున్నానని ఫీల్ అవుతుంది. బాధపడుతున్న పర్ల్‌కు అతడు మోటివేషన్ ఇస్తాడు. కానీ పర్ల్ మాత్రం తన కలకు అడ్డంగా ఉన్న తల్లిదండ్రులను చంపేయాలని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? పర్ల్ కల నెరవేరిందా? తను అనుకున్నట్టుగానే డ్యాన్సర్ అయ్యిందా? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.
మల్టీ టాలెంటెడ్ మియా..
‘ఎక్స్’ అనే ఫిల్మ్ సిరీస్‌లో రెండో చిత్రంగా తెరకెక్కించే ‘పర్ల్’. ఈ ఫ్రాంచైజ్‌లోని చిత్రాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు రక్తపాతం కూడా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా ‘పర్ల్’ సినిమాకు ప్రాణంగా నిలిచింది మాత్రం మియా గోత్ నటనే. ఒక సైకో అమ్మాయిగా.. ఒంటరితనాన్ని భరిస్తూ, తల్లి నుండి ఒత్తిడికి లోనవుతున్న యువతిగా తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకట్రెండు సీన్స్‌లో తన నటనతోనే ప్రేక్షకులను భయపెట్టింది మియా. ఇందులో అద్భుతంగా నటించడంతో పాటు తను రైటర్‌గా కూడా పనిచేసింది. 2022లో విడుదలయిన ‘పర్ల్’.. చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారు, రక్తపాతం ఉన్నా పర్వాలేదు అనుకునేవారు Netflixలో అందుబాటులో ఉన్న‘పర్ల్’ను ట్రై చేయవచ్చు.